ఏపీలో జాతీయ పార్టీల ప్రభావం ఏమీ ఉండదు: లగడపాటి
- 2014కు ముందు కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ మాజీ ఎంపీలు
- రాజమండ్రికి వెళ్లినప్పుడు ఉండవల్లి, హర్షను కలుస్తానన్న లగడపాటి
- వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని వ్యాఖ్య
మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ లతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. ఈ ముగ్గురు మాజీ ఎంపీల భేటీ ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. 2014కు ముందు ఈ ముగ్గురు రాజకీయ ప్రముఖులు ఏపీ రాజకీయాల్లో కీలకపాత్రను పోషించారు. ఆ తర్వాత ముగ్గురూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ యాక్టివ్ అవుతున్న తరుణంలో వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
భేటీ ముగిసిన అనంతరం లగడపాటి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాను చెప్పానని... చెప్పినట్టుగానే 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. రాజమండ్రికి తాను ఎప్పుడు వచ్చినా ఉండవల్లిని, హర్షకుమార్ ను కలుస్తుంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జాతీయ పార్టీల ప్రభావం ఏమీ ఉండదని... ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. ఉండవల్లి, హర్షకుమార్ ఏ పార్టీల తరపున పోటీ చేసినా వారికి తన మద్దతు ఉంటుందని లగడపాటి తెలిపారు.