మళ్లీ మళ్లీ అదే ప్రశ్న ఎందుకడుగుతారు?.. రిపోర్టర్‌పై హీరో విజయ్ సేతుపతి గుస్సా

  • విజయ్‌సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన ‘మెర్రీ క్రిస్మస్’ జనవరి 12న విడుదల
  • నిన్న చెన్నైలో జరిగిన చిత్రప్రచార కార్యక్రమంలో హిందీపై విలేకరి ప్రశ్న
  • హిందీ భాషను ఎవరూ వ్యతిరేకించట్లేదంటూ విజయ్ స్పష్టీకరణ
  • హిందీ నేర్చుకోమని బలవంతం చేయడాన్నే వ్యతిరేకిస్తున్నారని క్లారిటీ
హిందీ భాషపై విలేకరి ప్రశ్నలతో తమిళ హీరో విజయ్ సేతుపతి ఆగ్రహానికి గురయ్యారు. పదే పదే ఒకే ప్రశ్న అడగొద్దంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా రూపొందిన మెర్రీ క్రిస్మస్ జనవరి 12న దేశవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. 

కాగా, జనవరి 7న చెన్నైలో చిత్ర ప్రచార కార్యక్రమంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి దక్షిణాదిలో హిందీ భాషపై పలు ప్రశ్నలు సంధించారు. గత 75 ఏళ్లుగా తమిళ రాజకీయాలు హిందీ భాష వ్యతిరేకత చుట్టూ అల్లుకున్న విషయాన్ని ప్రస్తావించారు. కొందరు ఇప్పటికీ నాకు హిందీ రాదు అని రాసున్న టీషర్టులు ధరించడాన్ని పేర్కొన్నారు. 

దీనిపై విజయ్ సేతుపతి ఘాటుగా స్పందించారు. ‘‘ఓ భాషగా హిందీని ఎవరూ వ్యతిరేకించలేదు’’ అని తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ అడ్డుపడ్డ రిపోర్టర్ హిందీ భాష నేర్చుకోవడం తప్పనిసరా? అని ప్రశ్నించారు. దీంతో, విజయ్ ఒక్కసారిగా ఫైరైపోయారు. ‘‘మీరు ఇదే ప్రశ్న ఆమిర్ ఖాన్‌ను అడిగినట్టు నాకు గుర్తు. అదే ప్రశ్నను మీరు మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతున్నారు. హిందీ భాషకు మేం వ్యతిరేకం కాదు. ఆ భాషను తప్పనిసరి చేయడంపైనే మా వ్యతిరేకత. ఈ రెండింటీ మధ్య తేడా ఉంది. అనేక మంది ఇప్పటికే హిందీ నేర్చుకుంటున్నారు. ఎవరూ ఈ భాషను వ్యతిరేకించడం లేదు. మీది అనవసరమైన ప్రశ్న. హిందీ నేర్చుకోవద్దని ఎవరూ అనట్లేదు. ఈ విషయమై మంత్రి త్యాగరాజన్ కూడా వివరణ ఇచ్చారు. ఓసారి అది చూడండి’’ అని విజయ్ ఫైరైపోయారు.


More Telugu News