జగనన్న వదిలిన బాణం ఇప్పుడు జగనన్న పైనే తిరుగుతోంది: చంద్రబాబు

  • కాంగ్రెస్ లో చేరిన షర్మిల
  • టీడీపీ హస్తం ఉందన్న సజ్జల
  • వాళ్లింట్లో వ్యవహారంతో మాకేంటి సంబంధం అంటూ చంద్రబాబు ఫైర్
షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ... చెల్లెల్ని ఆరోజున జగనన్న బాణం అన్నారని వెల్లడించారు. జగనన్న వదిలిన బాణం ఏమైంది ఈ రోజు... ఆ జగనన్న పైనే తిరుగుతూ ఉంది అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"వాళ్లింట్లో వ్యవహారంతో మాకేంటి సంబంధం? ఆమెను నేనే ఆడిస్తున్నానంట. అంటే, ఆ రోజున ఆవిడతో పాదయాత్ర చేయించింది కూడా నేనేనా? ఇప్పుడు కూడా నేనే ఆమెతో తిరుగుబాటు చేయించానంట. ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి" అంటూ ధ్వజమెత్తారు.

ఆ రోజున వైఎస్ ను చంపింది రిలయన్సే అంటూ దాడులు చేశారు!

చంద్రబాబు తన ప్రసంగంలో వైఎస్ మరణం అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆ రోజున వైఎస్ చనిపోతే అందుకు రిలయన్సే కారణం అంటూ దాడులు చేశారని వెల్లడించారు. "ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. రిలయన్స్  అధినేత రాష్ట్రానికి వస్తే, వాళ్ల మనిషి పరిమళ్ నత్వానీకి వైసీపీ రాజ్యసభ అవకాశం ఇచ్చారు. ఇదీ ఆయన విశ్వసనీయత. ఇంతటి విశ్వసనీయత  ఉన్న వ్యక్తిని ఏమనాలో అర్థం కావడంలేదు? అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.

పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంట!

జగన్ రెడ్డి ప్రతిసారీ పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్నాడని, అదేంటో తనకు అర్థం కావడంలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ దేశంలోనే అత్యంత ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి అని, ఆయన సంపద విలువ రూ.510 కోట్లు అని పేర్కొన్నారు. దేశంలో అందరు ముఖ్యమంత్రుల ఆదాయం కంటే ఈయన ఆదాయమే ఎక్కువ అని తెలిపారు. ఈ ఐదేళ్లలో ప్రజల ఆదాయం పెరగలేదు కానీ, జగన్ ఆదాయం మాత్రం పెరిగిందని అన్నారు.


More Telugu News