అప్పుడు కట్నం వద్దన్నాడు.. రూ. 15 లక్షలు ఇస్తేనే ఇప్పుడు శోభనం అంటున్నాడు!

  • కర్ణాటకలోని బసవనగుడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • పెళ్లయిన తర్వాతి నుంచి కట్నం కోసం వేధింపులు
  • రూ. 5.8 లక్షలు ఇచ్చినా సంతృప్తి చెందని వైనం
  • మిగతా సొమ్ము ఇస్తేనే తొలిరాత్రికి సిద్ధమని స్పష్టీకరణ
పెళ్లికి ముందు కట్నకానుకలు వద్దన్న వ్యక్తి పెళ్లయ్యాక మాత్రం రూ.15 లక్షలు ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తానని చెప్పడంతో అవాక్కవడం అమ్మాయి తరపు బంధువుల వంతైంది. ఇందుకు సంబంధించి బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

బాధితురాలి కథనం ప్రకారం.. ఇంజినీర్ అయిన అవినాశ్‌వర్మతో 6 జూన్ 2022లో యువతి(27)కి వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నకానులు ఇతర లాంఛనాలు వద్దని చెప్పడంతో అల్లుడు ఎంత మంచివాడో అని అమ్మాయి తరపు బంధువులు మురిసిపోయారు. అయితే, వివాహం తర్వాత మాత్రం అవినాశ్‌వర్మలోని అసలు మనిషి బయటకు వచ్చాడు.

కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేని అమ్మాయి తల్లిదండ్రులు రూ. 5.8 లక్షలు సమర్పించుకున్నారు. అయినప్పటికీ సంతృప్తి చెందని అవినాశ్ తాను అడిగిన రూ. 15 లక్షల్లో మిగతా సొమ్ము ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తానని చెప్పాడు. ఇవ్వకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు రోజురోజుకు మరింత పెరగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News