ఆశలన్నీ కోల్పోయా.. జైలులోనే చనిపోవడం మేలు.. జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ ఆవేదన

  • కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో నరేశ్ గోయల్ అరెస్ట్
  • తన భార్యకు కేన్సర్ అని, తన ఏకైక కుమార్తెకు అనారోగ్యమని చెప్పిన గోయల్
  • తనకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ఆవేదన
  • సరైన చికిత్స అందించాలని న్యాయమూర్తి ఆదేశం
జీవితంపై ఉన్న ఆశలన్నీ కోల్పోయానని, ఇలాంటి పరిస్థితుల్లో బతకడం కంటే జైలులోనే మరణించడం మేలని జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కోర్టు హాలులోనే విలపించారు. మనీలాండరింగ్ కేసులో నిరుడు సెప్టెంబర్ 1న అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రత్యేక కోర్టులో నిన్న బెయిలుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యక్తిగత విచారణ అభ్యర్థనకు న్యాయమూర్తి అంగీకరించడంతో ఆయన తన ఆవేదనను కన్నీటితో వెల్లడించారు.

భార్యకు కేన్సర్.. కుమార్తెకు అనారోగ్యం
తన భార్యకు కేన్సర్ ముదిరిపోయిందని, తన ఒక్కగానొక్క కుమార్తె అనారోగ్యంతో ఉందని, వారిని చూసుకునేందుకు ఎవరూ లేరని గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని చెప్పారు. జేజే ఆసుపత్రికి తీసుకెళ్తున్నా సరైన సమయానికి సేవలు అందడం లేదన్నారు. ఇకపై ఆ ఆసుపత్రికి పంపొద్దని వేడుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతికి ఉండడం కంటే జైలులో చనిపోవడమే మేలని, కాబట్టి అందుకు అనుమతి ఇవ్వాలని కోరిన విషయం న్యాయస్థానం రోజువారీ విచారణ రికార్డుల్లో నమోదైంది.

సరైన చికిత్సకు ఆదేశం
నరేశ్ గోయల్ అభ్యర్థనపై న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే స్పందించారు. ఆయనను అలా నిస్సహాయస్థితిలో వదిలివేయబోమని భరోసా ఇచ్చారు. ఆయనకు సరైన చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని గోయల్ తరపు న్యాయవాదులను ఆదేశించారు. 

రూ.538.62 కోట్లు చెల్లించకపోవడంతోనే
జెట్‌ ఎయిర్‌వేస్ సంస్థ కెనరా బ్యాంకు నుంచి మొత్తం రూ. 848.86 కోట్ల రుణం తీసుకుంది. అందులో కొంతమొత్తం చెల్లించిన సంస్థ రూ.538.62 కోట్లు చెల్లించడంలో విఫలమైంది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీబీఐ కెనరా బ్యాంకును జెట్ ఎయిర్‌వేస్ మోసం చేసినట్టు తేల్చింది. ఇదే కేసులో మనీలాండరింగ్ అంశాలు కూడా ఉన్నట్టు తేలడంతో రంగంలోకి దిగిన ఈడీ నిరుడు సెప్టెంబరు 1న గోయల్‌‌ను అరెస్ట్ చేసింది.


More Telugu News