మెలకువతో ఉండి బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న 5 ఏళ్ల బాలిక

  • ఢిల్లీ ఎయిమ్స్‌లో అక్షిత అనే బాలికకు అరుదైన శస్త్రచికిత్స
  • 'అవేక్ క్రానియోటమీ' చికిత్స విధానంలో మెదడు ఎడమవైపు భాగంలో కణితి తొలగింపు
  • మెలకువతో ఉండి సర్జరీ చేయించుకున్న అతిపిన్న వయస్కురాలిగా నిలిచిన బాలిక
దేశరాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో అరుదైన సర్జరీ జరిగింది. అక్షిత అనే ఐదేళ్ల బాలిక స్పృహలో ఉండి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకుంది. చిన్నారిని మెలకువతో ఉంచి న్యూరో సర్జన్ల బృందం కణితిని విజయవంతంగా తొలగించింది. చేతనలో ఉండి ఈ సర్జరీని చేయించుకున్న ప్రపంచ అతి పిన్న వయస్కురాలిగా బాలిక నిలిచిందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ సర్జరీ టెక్నిక్‌ని 'అవేక్ క్రానియోటమీ'గా పిలుస్తారని, ఎడమ పెరిసిల్వియన్ ఇంట్రాయాక్సియల్ బ్రెయిన్ ట్యూమర్‌ తొలగింపులో దీనిని ఉపయోగించినట్టు వైద్యులు వెల్లడించారు. జనవరి 4న ఈ సర్జరీ జరిగిందని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

బాలిక మెదడు ఎడమ వైపు భాగంలో స్పీచ్ లేదా లాంగ్వేజ్ ప్రాంతానికి ఆనుకుని కణితి ఉన్నట్టుగా చిన్నారి మూర్ఛల హిస్టరీ, మెదడు ఎంఆర్ఐ స్కాన్‌ల ద్వారా వైద్యులు గుర్తించారు. బాలికకు లోకల్ అనస్థీషియా ఇవ్వడానికి తీసుకున్న సమయంతో కలిపి మొత్తం 3 గంటలపాటు సర్జరీ కొనసాగిందని డాక్టర్లు తెలిపారు. ప్రక్రియ అంతా బాలిక స్పృహలోనే ఉండడంతో న్యూరో సర్జన్ల బృందం కణితిని విజయవంతంగా తొలగించిందని, మేల్కొని ఉన్నప్పుడు కణితిని తొలగించడం ద్వారా నరాల సంబంధిత లోపాలను చాలా వరకు తగ్గించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే కొంత నొప్పిని అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించారు. 

 ఆపరేషన్ ప్రక్రియ మధ్యలో మూర్చ రాకుండా బాలిక మెదడు ఉపరితలంపై ఐస్ కోల్డ్ సెలైన్‌ను ఉపయోగించామని డాక్టర్లు తెలిపారు. సర్జరీ సమయంలో చిన్నారికి వివిధ వస్తువులు, జంతువుల బొమ్మలను చూపించారు. కాగా సర్జరీ అనంతరం చిన్నారి అక్షిత ఆరోగ్యంగానే ఉందని, సోమవారం ఇంటికి పంపించనున్నట్టు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. డాక్టర్ మిహిర్ పాండియా, డాక్టర్ జ్ఞానేంద్ర పాల్ సింగ్ నేతృత్వంలోని బృందం ఈ సర్జరీ నిర్వహించింది.


More Telugu News