మున్సిపల్ కార్మికుల మెజారిటీ డిమాండ్లకు అంగీకరించాం: మంత్రి బొత్స

  • ఏపీలో 12 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు
  • ఇప్పటికే కార్మికులతో రెండు పర్యాయాలు చర్చలు జరిపిన ప్రభుత్వం
  • నేడు మరోసారి సమావేశం
  • మున్సిపల్ కార్మికులు వెంటనే సమ్మె విరమించాలన్న మంత్రి బొత్స
  • ప్రస్తుత వేతనానికి మరో రూ.6 వేలు కలిపి ఇస్తామని వెల్లడి
ఏపీలో పట్టణ ప్రాంతాల పారిశుద్ధ్య కార్మికులు 12 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. మున్సిపల్ కార్మికులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం నేడు మరోసారి వారితో సమావేశమైంది. 

ఈ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల మెజారిటీ డిమాండ్లను అంగీకరించామని తెలిపారు. మున్సిపల్ కార్మికులకు వివిధ కేటగిరీల కింద జీతాలు ఉన్నాయని, ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి మరో రూ.6 వేలు కలిపి ఇస్తామని బొత్స వెల్లడించారు. విధుల్లో మరణించినవారి కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని చెప్పారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని బొత్స స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. 

మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం డిమాండ్ తో సమ్మె చేస్తున్నారు. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (గతంలో మున్సిపల్ శాఖ మంత్రి) ఇప్పటికే రెండు పర్యాయాలు మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు సఫలం కాలేదు. ఈ నేపథ్యంలోనే, నేడు మరోసారి చర్చలు జరిపారు.


More Telugu News