రెండేళ్లుగా లావాదేవీలు జరపని ఖాతాలపై బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలు

  • అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు తగ్గించడంపై ఆర్బీఐ దృష్టి
  • మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై రుసుం వద్దని బ్యాంకులకు సూచన
  • ఏప్రిల్ 1 నుంచి తాజా మార్గదర్శకాల అమలు
గత రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని బ్యాంకు ఖాతాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. గత రెండేళ్లుగా లావాదేవీలు జరపని బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేదంటూ వాటిపై రుసుం విధించవద్దని స్పష్టం చేసింది. 

ఒకవేళ ఆయా ఖాతాలు వాడుకలో లేవు అని బ్యాంకులు గుర్తిస్తే... ఆ విషయాన్ని ఖాతాదారులకు ఫోన్ సందేశాలు, లేఖ, ఈ-మెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించింది. ఖాతాదారులు అందుబాటులో లేకపోతే వారి నామినీకి ఆ సమాచారం అందించాలని పేర్కొంది. 

విద్యార్థులు ఉపకారవేతనాల కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన బ్యాంకు ఖాతాలు రెండేళ్లకు పైబడి వాడుకలో లేకపోయినా, వాటిని నిరుపయోగ ఖాతాలుగా గుర్తించరాదని ఆర్బీఐ వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

 బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు స్పందించింది. అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడంలో భాగంగానే తాజా సర్క్యులర్ జారీ చేసింది. 

2023 మార్చి నాటికి దేశంలోని వివిధ బ్యాంకుల్లో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.42,272 కోట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటి ఖాతాల్లో ఉన్న డిపాజిట్లను ఖాతాదారుల వారసులు, నామినీలు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా ఆర్బీఐ యూడీజీఏఎం (UDGAM) పేరిట ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించింది. 

కాగా, పదేళ్లకు పైబడి ఓ ఖాతాలో డిపాజిట్ ను ఎవరూ క్లెయిమ్ చేయకపోతే... ఆ మొత్తాన్ని 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ నిధి' పథకానికి బదిలీ చేస్తారు.


More Telugu News