సిద్ధిపేట చైర్ పర్సన్‌పై అవిశ్వాసం అంటూ వార్తలు... స్పందించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

  • చైర్ పర్సన్ మంజుల రాజనర్సుపై అవిశ్వాసం వార్తలను కొట్టిపారేసిన బీఆర్ఎస్, కౌన్సిలర్లు
  • సిద్దిపేటలో ఎప్పటికీ ఎగిరేది గులాబీ జెండానే అన్న కౌన్సిలర్లు
  • ఆరు గ్యారెంటీలు అమలు చేశాక కాంగ్రెస్ మాట్లాడాలని సూచించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు వచ్చిన వార్తలను బీఆర్ఎస్ శనివారం కొట్టి పారేసింది. మంజుల రాజనర్సుపై అసంతృప్తి ఉందని వస్తున్న వార్తలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఖండించారు. సిద్ధిపేట మున్సిపాలిటీ‌లో అవిశ్వాసం అనే మాటే లేదని తేల్చి చెప్పారు. 

ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ... సిద్ధిపేటలో ఎప్పటికీ ఎగిరేది గులాబీ జెండానే అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ అవినీతి చేశారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై తాము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. చైర్ పర్సన్ అవినీతిని నిరూపించకుంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధమా? అని కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు. 

ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాక కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేసిన తర్వాత మాట్లాడాలని సూచించారు. ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉంటామని... ప్రజల తరఫున పోరాడుతామని అన్నారు.


More Telugu News