కేరళలో పొగొట్టుకున్న ఖరీదైన ఎయిర్‌పాడ్‌ గోవా చేరిక.. ‘ఎక్స్’ సాయంతో సంపాదించుకున్న ముంబైవాసి!

  • వెకేషన్ కోసం కేరళ వెళ్లి ఎయిర్‌పాడ్ పోగొట్టుకున్న సోషల్ మీడియా ప్రొఫెషనల్
  • అది ఆన్‌లోనే ఉండడంతో ట్రాక్ చేయగలిగిన జైన్
  • ఆ తర్వాత అది మంగళూరు నుంచి గోవాకు పయనం
  • ఎక్స్ యూజర్ల సాయంతో గుర్తింపు
  • థ్యాంక్స్ చెప్పిన జైన్
ముంబైకి చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్, సోషల్ మీడియా కాంటెంట్ ఏజెన్సీ స్టోంక్స్ స్టూడియో సహ వ్యవస్థాపకుడు నిఖిల్ జైన్ వెకేషన్ కోసం కేరళ వెళ్లి ఖరీదైన ఎయిర్‌పాడ్ పోగొట్టుకున్నాడు. దానిని తిరిగి పొందేందుకు పోలీసులకంటే సోషల్ మీడియా యోధులే బెటరని భావించాడు. అతడి నమ్మకం వమ్ము కాలేదు. చివరికి పోగొట్టుకున్న ఎయిర్‌పాడ్ తిరిగి అతడి చెంతకు చేరింది. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే, వెకేషన్ కోసం కేరళ వెళ్లిన నిఖిల్ ఓ బస్సులో ఎయిర్‌పాడ్ మర్చిపోయి దిగేశాడు. తర్వాత ఎయిర్‌పాడ్ మర్చిపోయిన విషయం గుర్తించి మళ్లీ ఆ బస్సు వచ్చే వరకు వేచి చూశాడు. బస్సైతే వచ్చింది కానీ ఎయిర్‌పాడ్ మాత్రం లేకపోవడంతో నిరాశ చెందాడు. అయితే, ఆ ఎయిర్‌పాడ్ తనకు 40 కిలోమీటర్ల దూరంలో మరోచోట ఆన్‌లోనే ఉన్నట్టు గుర్తించాడు. ఆ తర్వాతి రోజు తనకు సమీపంలోని ఓ హోటల్‌లో ఉన్నట్టు తెలుసుకున్నాడు. 

దీంతో కేరళ పోలీసులతో కలిసి జైన్ ఆ హోటల్‌కు చేరుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అది సరిగ్గా ఏ రూములో ఉందన్న సరైన లొకేషన్ చూపించకపోవడం, హోటల్ అధికారులు సహకరించకపోవడంతో నిరాశే ఎదురైంది. ఆ తర్వాత తన ఎయిర్‌పాడ్ మంగళూరునుంచి గోవాకు వెళ్లినట్టు జైన్ గుర్తించాడు. అంతేకాదు, అతడు గోవా వ్యక్తే అయి ఉంటాడని నిర్ధారించుకున్నాడు.

గతేడాది డిసెంబర్ 21న ఈ విషయాలన్నీ చెబుతూ ఎక్స్‌లో ఓ పోస్టు  పెట్టాడు. కేరళ నుంచి తన ఎయిర్‌పాడ్‌ను గోవా తీసుకొచ్చిన వ్యక్తి రెండు రోజులుగా సౌత్ గోవాలో ఉన్నట్టు పేర్కొన్నాడు. అతడు గోవాకు చెందిన వ్యక్తే అయి ఉంటాడని భావిస్తున్నానని, డాక్టర్ అల్వారో డి లొయాలో ఫుర్టాడో రోడ్ సమీపంలో ఉన్నవారు ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తించాలని కోరాడు. 

ఈ పోస్టుకు అనూహ్యంగా రెస్పాన్స్ వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే గూగుల్ మ్యాప్ సాయంతో ఎయిర్‌పాడ్స్ తీసుకొచ్చిన ఇంటిని ట్విట్టర్ యూజర్లు గుర్తించారు. దీనిపై ఎక్స్‌లో విపరీతంగా చర్చ జరిగింది. ఆ తర్వాతి రోజు ఈ మెసేజ్ ఎయిర్‌పాడ్ ఉన్న ఇంటి పొరుగు వ్యక్తికి చేరింది. అతడు ఎయిర్‌పాడ్ తీసుకొచ్చిన వ్యక్తి బంధువే. తన బంధువులు కేరళ వెళ్లడం నిజమేనని ఆయన రాసుకొచ్చాడు. వారికీ విషయం చెబితే మార్గోవా పోలీస్ స్టేషన్‌లో ఎయిర్‌పాడ్‌ ఇచ్చేస్తానని చెప్పారని రాసుకొచ్చాడు. అనుకున్నట్టే డిసెంబరు 22న సాయంత్రం ఎయిర్‌పాడ్ మార్గోవా పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో జైన్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేస్తే ఎయిర్‌పాడ్ అక్కడ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

తన ఖరీదైన ఎయిర్‌పాడ్ తిరిగి దొరకడంలో సాయం చేసిన ఎక్స్ సభ్యులకు, దానిని గుర్తించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి ఈ సందర్భంగా జైన్ కృతజ్ఞతలు తెలిపాడు. మరికొన్ని రోజుల్లో తన స్నేహితుడు, మాజీ సహోద్యోగి గోవాకు వెళ్తున్నాడని, వాటిని తీసుకొచ్చే పని ఆయనకు అప్పగించినట్టు జైన్ వివరించాడు.


More Telugu News