బంగ్లాదేశ్‌లో విషాదం.. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురి సజీవదహనం

  • రాజధాని ఢాకాలో చోటుచేసుకున్న ఘటన.. నాలుగు కోచ్‌లకు వ్యాపించిన మంటలు
  • జాతీయ ఎన్నికలకు ఒకరోజు ముందు జరిగిన ఘటనపై పోలీసుల అనుమానాలు
  • విపక్షాలు ఎన్నికలు బహిష్కరించిన నేపథ్యంలో కుట్రకోణం ఉండొచ్చని సందేహాలు
బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో విషాదకర ఘటన జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. జెస్సోర్ నుంచి రాజధాని ఢాకాకు చేరుకున్న బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. కనీసం నాలుగు కోచ్‌లకు మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారి రక్జీబుల్ హసన్ వెల్లడించారు. ఐదురుగురు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని పోలీసు కమాండర్ అల్ మోయిన్ మీడియాకు తెలిపారు. ఢాకాలోని ప్రధాన రైల్వే టెర్మినల్ గోపీబాగ్ వద్ద రైలులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వందలాది మంది పరిగెత్తుకొచ్చి మంటల్లో కాలిపోతున్న ట్రైన్ నుంచి చాలా మంది ప్రయాణికులను బయటకు లాగారని వెల్లడించారు. మంటలు చాలా త్వరగా వ్యాపించాయని వివరించారు. కాగా ఈ రైలులో కొందరు భారతీయులు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

జాతీయ ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో కుట్రకోణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా నిప్పు పెట్టి ఉంటారా అనే కోణంలో సందేహిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదాన్ని విధ్వంస దాడిగా భావిస్తున్నామని పోలీసు చీఫ్ అన్వర్ హొస్సేన్ అన్నారు. గత నెలలో కూడా బంగ్లాదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. రైలులో మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటనకు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కారణమని పోలీసులు, ప్రభుత్వ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీఎన్‌బీ తీవ్రంగా వ్యతిరేకించింది. 

కాగా బంగ్లాదేశ్‌లో ఆదివారం (రేపు) జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఎన్‌పీ సహా ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించాయి. ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలని విపక్షాలు చాలా కాలంగా నిరసనలు తెలుపుతున్నాయి.  ఈ క్రమంలో గతేడాది చివరిలో వేలాది మంది ప్రతిపక్షాల కార్యకర్తలను ప్రభుత్వం అరెస్ట్ చేయించింది.


More Telugu News