వైసీపీ నుంచి మేం వెళ్లిపోతున్నాం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

  • సజ్జల తనకు టికెట్ లేదన్నారన్న కాపు రామచంద్రారెడ్డి
  • కనీసం సీఎంను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వెల్లడి
  • ఇంతకంటే అవమానం మరొకటి లేదని వ్యాఖ్యలు
  • ఇతర పార్టీల్లో అవకాశం వస్తే సద్వినియోగం చేసుకుంటామని వివరణ
  • అవకాశం రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తామని స్పష్టీకరణ
వైసీపీలో టికెట్ల వ్యవహారం మరింత ముదురుతోంది. ఇప్పటికే పలువురు పార్టీని వీడారు. ఆ బాటలోనే మరికొందరు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై అంటూ వ్యాఖ్యానించారు. 

ఇవాళ కాపు రామచంద్రారెడ్డి సీఎం జగన్ ను కలిసి మాట్లాడేందుకు తాడేపల్లి వచ్చారు. అయితే ఆయనకు అపాయింట్ మెంట్ దక్కలేదు. దాంతో, ఆయన తీవ్ర ఆవేదనతో మీడియాతో మాట్లాడారు. జగన్ ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వచ్చామని, కానీ తమ జీవితాలు సర్వనాశనం అయ్యాయని వ్యాఖ్యానించారు. 

సర్వే పేరు చెప్పి టికెట్ లేదనడం తీవ్రంగా బాధించిందని, నమ్మించి గొంతు కోశారని వాపోయారు. నా ఆవేదనను సీఎంతో చెప్పుకునేందుకు తాడేపల్లి వస్తే, కనీసం కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు అని ఆరోపించారు. ఉదయం వచ్చానని, కానీ సీఎం బిజీగా ఉన్నారంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి పంపించేశారని వెల్లడించారు. ఇంతకంటే అవమానం మరొకటి లేదని, వైసీపీ నుంచి వెళ్లిపోతున్నామని స్పష్టం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య కానీ, కొడుకు కానీ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి వెల్లడించారు. 

"పలుమార్లు టికెట్ వద్దని చెప్పాను... అయినా కూడా, ప్రభుత్వం వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి 2014లోనూ. 2019లోనూ నాకు టికెట్ ఇచ్చారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా మేం దానిపై ఎప్పుడూ అడగలేదు. 

మంచి జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే. ఇప్పుడు మాకు మంచి చేసే అవకాశం లేదు, చెడు చేసే అవకాశం లేదు. ఈ దరిద్రపు సర్వేలు ఏవైతే ఉన్నాయో మాకు తెలియదు. నీకు టికెట్ ఇవ్వడం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. సీఎం గారికి చెప్పుకుంటాం అని ఎంత అడిగినా అవకాశం ఇవ్వలేదు. 

ఇతర పార్టీల్లో (టీడీపీ, జనసేన) ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటాం. ఏ అవకాశం రాకపోయినా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి తీరుతాం" అని కాపు రామచంద్రారెడ్డి భావోద్వేగభరితంగా చెప్పారు.


More Telugu News