ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ట్రాన్స్ ఫర్లు ఉంటాయని నేనెప్పుడూ ఊహించలేదు: చంద్రబాబు వ్యంగ్యం

  • కనిగిరిలో రా కదలిరా సభ
  • ఐదేళ్లుగా చేసిన పాపాలు జగన్ ని ఇప్పుడు వెంటాడుతున్నాయని వ్యాఖ్య   
  • జగన్ కు ఓటమి భయం మొదలైందని వ్యాఖ్యలు
  • మంత్రులను, ఎమ్మెల్యేలను ట్రాన్స్ ఫర్ చేస్తున్నాడని ఎద్దేవా
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కనిగిరిలో ఏర్పాటు చేసిన రా కదలి రా సభలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. గత ఐదేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు జగన్ ను వెంటాడుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని జగన్ లో భయం మొదలైందని పేర్కొన్నారు. అందుకే సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నాడని... మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ట్రాన్స్ ఫర్లు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. 

ఒక నియోజకవర్గంలో చెత్తను తీసుకెళ్లి మరో నియోజకవర్గంలో పడేస్తున్నాడని, అలా చేసినంత మాత్రాన చెత్త కాస్తా బంగారం అవుతుందా తమ్ముళ్లూ...? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇలా ట్రాన్స్ ఫర్లు ఉంటాయని తానెప్పుడూ వూహించలేదని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. 

"మీ ఇంట్లో చెత్తను ఎక్కడేస్తాం... చెత్త కుండీలో వేస్తాం. కానీ ఈ ముఖ్యమంత్రి చెత్తను తీసుకెళ్లి వేరే నియోజకవర్గంలో వేస్తాడంట! ఇక్కడి పార్లమెంటు స్థానం పరిధిలో ఏడుగురు ఎమ్యెల్యేలు ఉన్నారు. 

ఇక్కడొక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు... బుర్రా మధుసూదన్. మధుసూదన్ కాదు... 'మనీ'సూదన్. అతడికి అన్నింట్లో వాటా కావాలి. అన్నింట్లో దోపిడీనే. అతడిని ఇంకా ఎందుకు మార్చలేదని అడుగుతున్నా. యర్రగొండపాలెంలో ఇంకొకాయన ఉన్నాడు... బట్టలిప్పేసి తిరుగుతుంటాడు. ఆయనొక మంత్రి. ఇప్పుడాయనకు ట్రాన్స్ ఫర్ వచ్చింది. తీసుకెళ్లి కొండేపిలో పడేశారు. యర్రగొండపాలెంలో చెత్త కొండేపిలో బంగారం అవుతుందా? 

మార్కాపురంలో మరొకాయన ఉన్నాడు... ఆయన ఒక నయీం, ఆయన తమ్ముడొక చోటా నయీం. ఈ పేర్లను స్థానికంగానే పిలుచుకుంటున్నారు. ఇంకొకాయన గిద్దలూరులో ఉన్నాడు. ఆయన నావల్ల కాదు, నేను పోటీ చేయను అని పారిపోయాడు. దర్శిలో మరొకాయన ఉన్నాడు. ఎక్కడి చూసినా వాటాలు కావాలి... ఇప్పుడాయనకు సీటే లేదు పొమ్మన్నాడు. 

ఒంగోలులో ఇంకొకరు ఉన్నారు. మొదట్లో జిల్లా అంతా నాదే, రాష్ట్రమంతా నాదే అన్నాడు. అతడు ఇప్పుడెక్కడున్నాడు తమ్ముళ్లూ... అడ్రస్  గల్లంతైపోయింది. గతంలో కొండేపిలో ఒక అనామకుడ్ని పెట్టారు... ఇప్పుడాయన అడ్రస్ ఎక్కడుందో మనందరం వెతుక్కోవాలి! ఇది రాజకీయమా? నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన తప్పులకు, ఎమ్మెల్యేలను బలిపశువులను చేశారు" అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

పిట్టకథ చెప్పిన చంద్రబాబు

ఓ గజదొంగ ఉంటాడు. కోర్టులో విచారణ మొత్తం పూర్తయ్యాక అతడికి ఉరిశిక్ష వేస్తారు. నీ చివరి కోరిక ఏమిటని జడ్జి అతడిని అడుగుతాడు. అప్పుడా గజదొంగ తన తల్లిని పిలిపించమంటాడు. అతడి కోరిక ప్రకారమే తల్లిని పిలిపిస్తారు. అక్కడికి వచ్చిన తల్లిని పట్టుకుని ఆ గజదొంగ గట్టిగా కొరుకుతాడు. దాంతో జడ్జి... అదేంటి, తల్లిని పట్టుకుని ఎందుకలా కొరికావు? అని ప్రశ్నిస్తాడు. 

అందుకా గజదొంగ బదులిస్తూ... తాను తప్పు చేసిన మొదటిరోజే చెంప మీద ఒక దెబ్బకొట్టి ఇది తప్పు అని చెప్పి ఉంటే ఇవాళ నేనిలా నేరస్తుడ్ని అయ్యేవాడ్ని కాదు అని చెబుతాడు. నేను తెచ్చిన దొంగడబ్బుకు ఆనందపడి పొగడడం మొదలుపెట్టింది. దాంతో నేను విచ్చలవిడిగా నేరాలు చేశాను. నా తప్పులన్నింటికీ తల్లే కారణం అన్నాడు. ఇదే విధంగా ఏపీలో ఎమ్మెల్యేలతో తప్పులు చేయించారు. వాటాల కోసం అవినీతి చేయించారు... అందరినీ ఇష్టానుసారం వాడుకున్నారు.

నన్ను, పవన్ కల్యాణ్ ను తిట్టాలంట!

ఈ జిల్లాలోనే ఓ ఎమ్మెల్యేకు ఏం చెప్పారో చూడండి. నన్ను, పవన్ కల్యాణ్ ను తిట్టాలంట. మమ్మల్ని తిడితేనే అతడికి టికెట్ ఇస్తారంట. ఎమ్మెల్యే సీటు కావాలన్నా, ఎంపీ సీటు కావాలన్నా ఎంత సేవ చేశాం అని కాదు... చంద్రబాబును ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేశ్ ను ఎంత తిట్టావు, పవన్ కల్యాణ్ ను ఎంత తిట్టావు? అనే అంశాల ఆధారంగా టికెట్లు ఇస్తే ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. 

కానీ, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం... మాకు సంస్కారం ఉంది, మేం తిట్టం, నువ్వు సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదు అని చెప్పారు. వాళ్లను నేను గట్టిగా అభినందిస్తున్నా.

నా జీవితంలో ఆ ఒక్కరోజే బాధపడ్డాను!

నన్ను, నా భార్యను అసెంబ్లీ సాక్షిగా తిట్టారు. అలా తిడితే వీళ్లు పెద్ద నాయకులు అయిపోతారా? ఎప్పుడూ బాధపడని నేను నా జీవితంలో ఆ ఒక్కరోజు బాధపడ్డాను. 23 క్లేమోర్ మైన్స్ పేలినా సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా నేను భయపడలేదు. ప్రజల కోసం మంచి చేస్తున్నప్పుడు భయమెందుకు? కానీ, జీవితంలో ఒక్కరోజు మాత్రం బాధపడ్డాను... నా భార్యను అసెంబ్లీలో తిట్టినందుకు బాధ కలిగింది. 

ఆ రోజే చెప్పాను... ఇది గౌరవ సభ కాదు, ఈ సభలో నేను ఉండను అని స్పష్టం చేశాను. ఇది కౌరవ సభ... దీన్ని మళ్లీ గౌరవ సభ చేసిన తర్వాతే ఇక్కడ అడుగుపెడతానని శపథం చేసి వచ్చాను.. అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.


More Telugu News