తనిఖీలకు వెళ్తున్న ఈడీ బృందంపై దాడి.. టీఎంసీ నేత అరెస్ట్

  • రేషన్ పంపిణీ కుంభకోణం ఆరోపణలపై తనిఖీకి ఈడీ బృందం
  • అధికారులు, సాయుధ బలగాలను చుట్టుముట్టి దాడి చేసిన 200 మందికిపైగా స్థానికులు
  • గాయపడిన అధికారులు ఆసుపత్రికి తరలింపు
  • టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్ట్
పశ్చిమబెంగాల్‌, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాళీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి జరిగింది. రేషన్ పంపిణీ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ఈడీ అధికారులు దాడులకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తృణమూల్ నేత షాజహాన్ షేక్ నివాసం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు, సాయుధ బలగాలను చుట్టుముట్టిన 200 మందికిపైగా స్థానికులు ఈ దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఈడీ అధికారులను ఆసుపత్రికి తరలించారు. 

అధికారులపై దాడిచేసిన స్థానికులు వారు ప్రయాణిస్తున్న వాహనాలపైనా దాడిచేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. రోహింగ్యాల వల్ల రాష్ట్రంలోని శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన చెప్పకనే చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కోరారు. ఈడీ అధికారులపై దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


More Telugu News