మా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం... పేల్చేస్తామంటున్నారు: మంత్రి సీతక్క ఆగ్రహం

  • తాము ప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న మంత్రి సీతక్క
  • తమది గడీల పాలన కాదు... గల్లీ బిడ్డల పాలన అన్న మంత్రి  
  • బీఆర్ఎస్ ఫ్యూడల్ పార్టీ అని ఆరోపణ
తాము ప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే... కూల్చేస్తాం.. పేల్చేస్తామంటూ మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... తమది గడీల పాలన కాదని... గల్లీ బిడ్డల పాలన అనీ అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని... దీనిని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోవడం లేదన్నారు. అందుకే తమ ప్రభుత్వంపై వారు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ఫ్యూడల్ పార్టీ అని ఆరోపించారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకకాలంలో రుణమాఫీ అని హామీ ఇచ్చారని... కానీ ఏం చేశారో అందరికీ తెలుసునన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగలు దోచుకున్నారని, బీఆర్ఎస్ 420 అనే ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు. తాము ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు.


More Telugu News