వికెట్లు టపటపా రాలుతున్న కేప్ టౌన్ పిచ్ ఇదిగో ఇలా ఉంది!

  • కేప్ టౌన్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
  • రెండో టెస్టుకు వేదికగా నిలుస్తున్న న్యూలాండ్స్ మైదానం
  • తొలి రోజే 23 వికెట్లు పతనం
  • రెండో రోజు కూడా కొనసాగుతున్న వికెట్ల జాతర
కేప్ టౌన్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. ఇక్కడి న్యూలాండ్స్ స్టేడియం పిచ్ పేసర్లకు స్వర్గధామంలా మారడంతో తొలి సెషన్ నుంచే వికెట్లు టపటపా రాలాయి. 

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో మరీ దారుణంగా 55 పరుగులకే ఆలౌట్ కాగా, టీమిండియా 153 పరుగులు చేసింది. 153 పరుగుల స్కోరు వద్దే టీమిండియా ఏకంగా 6 వికెట్లు కోల్పోయిందంటే పిచ్ ప్రభావం అర్థం చేసుకోవచ్చు. మొత్తమ్మీద తొలి రోజు ఆటలో 23 వికెట్లు పతనం అయ్యాయి. ఇవాళ రెండో రోజు ఆట ఆరంభంలోనే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు చేజార్చుకుంది. 

ఇంతటి వికెట్ల జాతరకు కారణమైన కేప్ టౌన్ పిచ్ ను పరిశీలిస్తే... పిచ్ పై పచ్చిక మెండుగా కనిపిస్తోంది. దానికితోడు పిచ్ పై పగుళ్లు కూడా ఉండడంతో బ్యాట్స్ మన్లకు పీడకలలు మిగుల్చుతోంది. బౌలర్ చేతిలోంచి రిలీజయిన బంతి పిచ్ మీద ఉన్న పగుళ్లపై పడిన తర్వాత... ఎటు దూసుకువస్తుందో, ఎంత ఎత్తున బౌన్స్ అవుతుందో అర్థం కాక బ్యాట్స్ మన్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. 

బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేయాలంటేనే హడలిపోయేలా పిచ్ ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను మహ్మద్ సిరాజ్, బుమ్రా, ముఖేశ్ కుమార్ లతో కూడిన టీమిండియా పేస్ త్రయం వణికించిందంటే సబబుగా ఉంటుంది. సిరాజ్ పిచ్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని 6 వికెట్లు సాధించడం విశేషం. బుమ్రా, ముఖేశ్ కూడా చెరో వికెట్లతో సఫారీల పనిబట్టారు. 

ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్ కూడా పిచ్ దెబ్బకు పడుతూ లేస్తూ సాగింది. కోహ్లీ (46), రోహిత్ శర్మ (39), శుభ్ మాన్ గిల్ (36) ఓ మోస్తరుగా రాణించినా, పిచ్ ను అర్థం చేసుకోవడం వారికి కూడా కష్టసాధ్యమైంది. దక్షిణాఫ్రికా యువ పేసర్ నాండ్రే బర్గర్ వేసిన చాలా బంతులు కోహ్లీ బ్యాట్ తగలకుండానే వికెట్ కీపర్ చేతుల్లో వాలాయి. ఓ దశలో బర్గర్ బౌలింగ్ లో కోహ్లీ ఏ క్షణమైనా అవుటయ్యేలా కనిపించాడు. పెద్దగా ఫామ్ లో లేని లుంగీ ఎంగిడి సైతం ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడంటే అది కేప్ టౌన్ పిచ్ మహిమే.


More Telugu News