లిఫ్ట్ అడిగి కారెక్కి.. డబ్బులు ఇవ్వకుంటే డ్రైవర్‌పై వేధింపుల కేసు పెడతానని బెదిరింపు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

  • కారు కొద్ది దూరం వెళ్లగానే డబ్బులు డిమాండ్ చేసిన నిందిత మహిళ
  • డబ్బులు ఇవ్వకుంటే లైగింక వేధింపుల కేసు పెడతానని బెదిరింపులు 
  • కారును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన బాధిత డ్రైవర్
  • నిందిత మహిళపై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం షాకింగ్ ఘటన నమోదయింది. ముఖానికి మాస్క్ పెట్టుకొని లిఫ్ట్ అడిగి ఓ కారు ఎక్కిన మహిళ తనకు డబ్బులు ఇవ్వకుంటే లైంగికంగా వేధించావని కేసు పెడతానంటూ డ్రైవర్‌ను బెదిరించింది. అప్రమత్తమైన డ్రైవర్‌ కారును నేరుగా బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడంతో మహిళ వ్యవహారం బయటపడింది. నిందిత మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని నయిమా సుల్తానా(32)గా గుర్తించారు. తనను తాను లాయర్‌గా ఆమె చెప్పుకుంటోందని పోలీసులు తెలిపారు. ఆమె వద్ద లభించిన పుస్తకంలో కొన్ని ఆధారాలను గుర్తించామని, ఆమెపై హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో 15కిపైగా కేసులు ఉన్నాయని వెల్లడించారు. దీంతో నయిమా సుల్తానును అరెస్ట్‌ చేశామన్నారు. బార్‌ అసోసియేషన్‌కు లేఖ రాసి ఆమె గురించి తెలుసుకోనున్నామని జూబ్లీహిల్స్‌ పోలీసులు వెల్లడించారు.
  
బంజారాహిల్స్‌ రేషంబాగ్‌ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌ పరమానంద‌కు మంగళవారం రాత్రి ఈ ఘటన ఎదురైంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి కేబీఆర్‌ పార్క్ వైపు కారులో వెళ్తుండగా చెక్‌పోస్టు వద్ద ఓ మహిళ లిఫ్టు అడిగిందని డ్రైవర్ తెలిపాడు. ఆమెను కారులో ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్లాక డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, లేదంటే లైంగిక దాడికి పాల్పడ్డానంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించిందని వివరించాడు. కాగా బంజారా హిల్స్‌లో ఇటీవలే ఈ తరహా ఘటన ఒకటి నమోదయ్యింది. ముఖానికి మాస్క్‌ ధరించి లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కిన ఓ మహిళ డ్రైవర్‌ను డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకుంటే లైంగికంగా వేధించావంటూ ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఈ ఘటనలో మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


More Telugu News