కడప పరిస్థితి ఏంది?: పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవితో వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్
- ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయాలు
- రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్న షర్మిల
- కడప రాజకీయాల గురించి రవితో చర్చించిన అనిల్
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ షర్మిల చేపట్టబోతున్నారనే పరిణామాల నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా టీడీపీ యువనేత లోకేశ్ కు సీఎం జగన్ సోదరి, వైఎస్ షర్మిల గిఫ్ట్ పంపించడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. ఈరోజు జరిగిన మరో పరిణామం ఉత్కంఠను మరింత పెంచుతోంది. జగన్ గడ్డ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జీ బీటెక్ రవి, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కడప ఎయిర్ పోర్టులో ముచ్చటించుకోవడం ఆసక్తికరంగా మారింది. కడప ఎయిర్ పోర్టులో వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా తీసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇద్దరూ కూడా పలు అంశాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల వస్తే ఎలా ఉంటుందని రవిని అనిల్ అడిగారు. దీనికి సమాధానంగా అన్ని విధాలుగా బాగుంటుందని రవి చెప్పారు. కడప జిల్లాలో రాజకీయం ఎలా ఉందని కూడా రవిని అనిల్ అడిగినట్టు సమాచారం. దాదాపు అరగంటకు పైగా బీటెక్ రవితో బ్రదర్ అనిల్ సంభాషించారు.