మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఎంతటి వ్యక్తుల జీవితాలైనా వనవాసంతో ముగియాల్సిందేనని చెప్పారు. మధ్యప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే, నాలుగు సార్లు సీఎంగా చేసిన శివరాజ్ ను కాకుండా మోహన్ యాదవ్ ను పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రిగా నియమించింది.
నిన్న షాగంజ్ టౌన్ లో జరిగిన కార్యక్రమంలో శివరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు గట్టిగా అరుస్తూ... మీరు ఎక్కడికీ వెళ్లకూడదని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ... తాను ఎక్కడికీ వెళ్లనని, అందరి మధ్య ఇక్కడే ఉంటానని చెప్పారు. నేను ఇక్కడే ఉంటా... ఇక్కడే చచ్చిపోతా అని అన్నారు.
తన హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలని శివరాజ్ చెప్పారు. రాజరికంలో ఉన్న వారి జీవితాలు కూడా చివరకు వనవాసంతో ముగుస్తాయని అన్నారు. శివరాజ్ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.