లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • బీజేపీ 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టీకరణ
  • జనసేన ప్రస్తుతానికి ఎన్డీయేలో భాగస్వామిగా ఉందని వ్యాఖ్య
  • ఢిల్లీ నుంచి పరిశీలకులు వచ్చాక బీజేపీ ఎల్పీని ప్రకటిస్తారన్న కిషన్ రెడ్డి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనుందని... జనసేనతో పొత్తు ఉండకపోవచ్చునని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉందని స్పష్టం చేశారు. అయితే ఏపీలో ఆ పార్టీతో పొత్తు అంశంపై తమ మధ్య చర్చకు రాలేదన్నారు.

బీజేపీ శాసన సభా పక్ష నేతను అమిత్ షా వచ్చినప్పుడే ప్రకటించాల్సిందని... కానీ ఆలస్యమైందన్నారు. ఢిల్లీ నుంచి పరిశీలకులు వస్తారని... వారు ఎల్పీపై ప్రకటన చేస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు, బీసీలకు తాము ప్రాధాన్యత ఇచ్చామని, లోక్ సభ ఎన్నికల్లోనూ వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ రావొచ్చునని అభిప్రాయపడ్డారు.


More Telugu News