షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలపై వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే...!

  • షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం
  • షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీకి నష్టమేమీ ఉండదన్న వైవీ
  • అసలు... షర్మిల కాంగ్రెస్ లో చేరతారో, లేదో అంటూ వ్యాఖ్యలు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. అసలు, షర్మిల కాంగ్రెస్ లో చేరతారో, లేదో అని వ్యాఖ్యానించారు. తాను జగన్ తరఫున షర్మిల వద్దకు రాయబారం వెళ్లినట్టు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

ఇక, వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల వైపు అడుగులేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వైవీ స్పష్టం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిల వైపు వెళుతున్నాడని, మరికొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీలు మారుతున్నారని వివరించారు. 

ఇక వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు అంశంపైనా ఆయన స్పందించారు. పార్టీలో అందరికీ న్యాయం చేయలేమని అభిప్రాయపడ్డారు. ఓ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు, అభ్యర్థిపై వ్యతిరేకత... ఇలాంటి అంశాల ఆధారంగా సీట్ల మార్పు ఉంటుందని వివరించారు. అయితే, ఎన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనేది చెప్పలేమని వ్యాఖ్యానించారు. 

ఎన్నికల్లో వైసీపీ నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే అనేక చోట్ల అభ్యర్థులను మార్చుతున్నామని, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైవీ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News