వైసీపీకి మరో భారీ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు
- రాజీనామా లేఖను జగన్ కు పంపిన దాడి వీరభద్రరావు
- సజ్జల, విజయసాయిలకు కూడా రాజీనామాను పంపిన దాడి
- వైసీపీకి దాడి రాజీనామా చేయడం ఇది రెండోసారి
ఎన్నికలకు ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు కూడా రాజీనామా పత్రాలను పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నానని ఏక వాక్యంతో రాజీనామా లేఖ రాశారు. మరోవైపు మీడియాతో ఆయన మాట్లాడుతూ... త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన ఉంటుందని చెప్పారు. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెపుతానని అన్నారు.
ఉమ్మడి ఏపీలో టీడీపీలో దాడి వీరభద్రరావు కీలక నేతగా వ్యవహరించారు. నాలుగు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు మందు మళ్లీ వైసీపీలో చేరారు. ఇప్పుడు, వైసీపీకి మరోసారి రాజీనామా చేశారు.