దయచేసి పనులు మాత్రం ఆపొద్దు: మంత్రి దామోదరకు మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తి

  • ఆందోల్‌లో అభివృద్ధి పనులను ఆపాలని మంత్రి దామోదర చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపణ
  • ఎస్డీఎఫ్, సీడీపీ నిధులతో అభివృద్ధి పనులు చేశానన్న క్రాంతి కిరణ్
  •  నిధులు సరిపోకుంటే మరిన్ని నిధులు ఇచ్చి పూర్తి చేయాలని విజ్ఞప్తి
నియోజకవర్గంలో తాము ప్రారంభించిన పనులను ఆపవద్దని ఆందోల్ ఎమ్మెల్యే, మంత్రి దామోదర రాజనర్సింహకు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత క్రాంతి కిరణ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ... అందోల్‌లో అభివృద్ధి పనులను ఆపాలని మంత్రి దామోదర చూస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆందోల్ నియోజకవర్గంలో ఎస్డీఎఫ్, సీడీపీ నిధులతో అభివృద్ధి పనులు చేశానన్నారు. 80 శాతం వరకు గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించానని వెల్లడించారు.

కొన్ని టెండర్లు పూర్తయ్యాయని... మరికొన్ని పనులు నడుస్తున్నాయన్నారు. అయితే ఈ పనులను ఆపాలని మంత్రి దామోదర అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. మంజూరైన నిధులు సరిపోకపోతే మరిన్ని నిధులు ఇవ్వాలని సూచించారు. అంతేకానీ పనులను మాత్రం ఆపవద్దని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులలో రాజకీయ కక్షసాధింపు చర్యలు సరికావని... సహకరించాలని హితవు పలికారు.


More Telugu News