ఖజానా లేదు.. రేవంత్ రెడ్డి కళ్లలో ఆనందం లేదు...: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్

  • కొత్త ఏడాదిలో తెలంగాణ ఆస్తులు పెరిగి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఆశాభావం వ్యక్తం చేసిన బీజేపీ నేత
  • కాంగ్రెస్ తన 30 రోజుల పాలనలో సాధించింది కేవలం శ్వేతపత్రాల విడుదలేనని ఎద్దేవా
  • కేసీఆర్ తెలంగాణను మొత్తం గీకేసి పోయాడన్న నర్సయ్య  
తెలంగాణ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని.. ఖజానాలో ఏమీ లేదని... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లలో ఆనందం కూడా లేదని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సోమవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కొత్త ఏడాదిలో తెలంగాణ ఆస్తులు పెరిగి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ఈ ముప్పై రోజుల్లో సాధించింది కేవలం శ్వేతపత్రాల విడుదల మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణను మొత్తం గీకేసి పోయాడని... ఏమీ లేదన్నారు.

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రానున్న లోక్ సభ ఎన్నికల్లో 17కు 17 సీట్లలో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని... అందుకే కాలయాపన చేస్తోందని విమర్శించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం చెమటోడ్చి 6.32 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని చురక అంటించారు. ప్రధాని నరేంద్ర మోదీ వేసిన రోడ్ల కారణంగానే రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డును కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించలేదని విమర్శించారు. మోదీ జెన్ కో, ట్రాన్స్ కో సంస్థలకు రూ.80 వేల కోట్ల రుణాలు ఇస్తేనే కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇచ్చారన్నారు.


More Telugu News