బాంబు దాడిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ హతం...?

  • మసీదు నుంచి తిరిగి వస్తుండగా దాడి అంటూ కథనాలు
  • మసూద్ అజహర్ అక్కడికక్కడే  మృతి చెందినట్టు కథనాల్లో వెల్లడి
  • పాకిస్థాన్ మీడియాలో ఎక్కడా కనిపించని మసూద్ అజహర్ మృతి వార్తలు
  • పాక్ ప్రభుత్వం నుంచి వెలువడని ప్రకటన
భారత్ లో అనేకమంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ ఓ బాంబు దాడిలో హతమైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోగా, అటు పాకిస్థాన్ మీడియాలోనూ మసూద్ అజహర్ మృతిపై ఎలాంటి వార్తలు రాకపోవడంతో దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. 

పాకిస్థాన్ లోని భవల్ పూర్ లో ఓ మసీదు నుంచి తిరిగివస్తున్న మసూద్ అజహర్ పై కొందరు దుండగులు బాంబు దాడి చేశారని, దాంతో మసూద్ అజహర్ ఘటనస్థలంలోనే ప్రాణాలు విడిచాడని సోషల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. 

మసూద్ అజహర్ ఎప్పటి నుంచో భారత్ కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్నాడు. 1995లో మసూద్ అజహర్ ను భారత్ అరెస్ట్ చేసినప్పటికీ, కొందరు ఉగ్రవాదులు 1999లో విమానాన్ని హైజాక్ చేసి అతడిని విడిపించుకున్నారు. ఆ తర్వాతే అతడు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి భారత్ పై అనేక ప్రతీకార దాడులు చేశాడు. 

మూడేళ్ల కిందట పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి మసూద్ అజహరే. అంతకుముందు, 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడి, 2008 ముంబయి బాంబు పేలుళ్లకు కూడా మసూద్ అజహరే ప్రణాళిక రచించాడు. 

కాగా, పుల్వామా ఘటన తర్వాత ఐక్యరాజ్యసమితి అజహర్ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐరాస ప్రకటన నేపథ్యంలో, మసూద్ అజహర్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ చెబుతూ వస్తోంది. ఒకవేళ మసూద్ అజహర్ నిజంగానే చనిపోయినా, పాకిస్థాన్ ఆ విషయం అంగీకరించే పరిస్థితి లేదు.


More Telugu News