పొరబాటున షహీన్ ను కెప్టెన్ చేశారు: షాహిద్ అఫ్రిది

  • అల్లుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
  • పాకిస్థాన్ టీ20 కెప్టెన్ గా షహీన్ అఫ్రిది 
  • రిజ్వాన్ కెప్టెన్ అయితే బాగుండేదన్న షాహిద్ అఫ్రిది
వరల్డ్ కప్ లో ఘోర వైఫల్యం తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. కెప్టెన్ గా బాబర్ అజామ్ ను తప్పించి, ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో కెప్టెన్ ను నియమించారు. టీ20 ఫార్మాట్ లో యువ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. 

అయితే, షహీన్ అఫ్రిదికి పిల్లనిచ్చిన మామ, పాక్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ రిజ్వాన్ కు కెప్టెన్సీ ఇస్తారని భావించానని, కానీ పొరబాటున షహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ ఇచ్చినట్టుందని చమత్కరించాడు. 

మహ్మద్ రిజ్వాన్ గొప్ప యోధుడు అని, నైపుణ్యాలను ఏ స్థాయిలో, ఎంతవరకు ఉపయోగించుకోవాలో అతడికి తెలుసని అఫ్రిది కొనియాడాడు. "నేను రిజ్వాన్ ను టీ20 కెప్టెన్ గా చూడాలనుకున్నాను. కానీ షహీన్ కెప్టెన్ అయిపోయాడు" అంటూ వ్యాఖ్యానించారు. 

ఓ కార్యక్రమంలో షాహిద్ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో షహీన్ అఫ్రిది, రిజ్వాన్ కూడా వేదికపై ఉన్నారు. మామ గారి సరదా వ్యాఖ్యలకు షహీన్ నవ్వులు చిందించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


More Telugu News