డిసెంబర్ 31న నాన్-వెజ్‌ను కుమ్మేసిన హైదరాబాదీలు... రికార్డ్‌స్థాయిలో చికెన్ అమ్మకాలు

  • సాధారణంగా రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు
  • డిసెంబర్ 31న 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలతో రికార్డ్
  • నిన్న ఒక్కరోజే రూ.10.35 కోట్ల వ్యాపారం జరిగిందంటున్న పౌల్ట్రీ వ్యాపారులు
ఆదివారం అంటే చాలామంది ఇళ్లలో నాన్-వెజ్ తప్పనిసరి. ఇక, డిసెంబర్ 31న... ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు యువత చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో నాన్-వెజ్‌కి గిరాకీ బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాదీలు నిన్న మటన్, చికెన్‌ను బాగా ఆస్వాదించారు. సాధారణ రోజుల కంటే నిన్న ఒక్కరోజే ఒకటిన్నర రెట్ల చికెన్ అమ్ముడుపోయిందట. సాధారణంగా హైదరాబాద్‌లో ప్రతిరోజు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతాయి. కానీ నిన్న డిసెంబర్ 31 కారణంగా 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి.

నిన్న ఒక్కరోజే రూ.10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. మటన్ ధర రూ.900 వరకు పలుకుతోంది. అయినప్పటికీ దాదాపు 25వేల నుంచి 30వేల క్వింటాళ్ల మటన్ విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. న్యూఇయర్ రోజైన.. ఈ రోజు కూడా విక్రయాల్లో జోరు కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి విక్రయాలు మరింతగా పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు.


More Telugu News