హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్.. ఒక్కరోజే 2,700 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

  • మియాపూర్ లో అత్యధికంగా 253 మందిపై కేసు
  • సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,241 కేసులు
  • 26 నుంచి 35 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువున్నారని పోలీసుల వెల్లడి
కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ లో యువతీ యువకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సిటీ పరిధిలోని పబ్బులు, క్లబ్బులతో పాటు వివిధ చోట్ల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లలో ఆడి పాడారు. 2023కు వీడ్కోలు చెబుతూ మందు పార్టీలు చేసుకున్నారు. ఆపై వాహనాలతో రోడ్లెక్కి హంగామా చేశారు. వేడుకలలో మద్యం సేవించి ఆపై వాహనాలు నడపొద్దంటూ పోలీసులు చేసిన సూచనలను పట్టించుకోలేదు. వాహనాలతో రోడ్లపైకి వచ్చిన మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని పలుచోట్ల టెస్టులు నిర్వహించి డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. 

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ ల పరిధిలో ఆదివారం ఒక్కరోజే 2,700 లకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,500 మంది మందుబాబులు పట్టుబడగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,241 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉండడం విశేషం. సిటీలో ఎక్కువగా మియాపూర్‌లో 253 కేసులు నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిలో 382 మంది 18 నుంచి 25 ఏళ్ల లోపు వారు కాగా, 26 సంవత్సరాల నుంచి 35 వయసున్న వారు 536 మంది ఉన్నారని వివరించారు. సీజ్ చేసిన వాహనాలలో 938 టూ వీలర్స్, 21 త్రీ వీలర్స్, 275 ఫోర్ వీలర్స్, 7 హెవీ వెహికల్స్ ఉన్నాయి.


More Telugu News