హత్యకేసులో 30 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు.. భార్య ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టేసుకున్న పోలీసులు

  • 1989లో ఓ హత్యకేసులో నిందితుడిగా దీపక్ నారాయణ్
  • 1992లో బెయిలు మంజూరు చేసిన కోర్టు
  • అప్పటి నుంచి విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు
  • 31 ఏళ్ల తర్వాత తిరిగి బేడీలు
ఓ హత్యకేసులో 30 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. భార్య, పిల్లలతో కలిసి మరోచోట కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్న అతడికి ముంబై పోలీసులు సంకెళ్లు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1989లో జరిగిన ఓ హత్యకేసులో ముంబైకి చెందిన దీపక్ నారాయణ్ భీసే (62) నిందితుడు. ఈ కేసులో అతడికి 1992లో బెయిలు మంజూరైంది.

ఆ తర్వాతి నుంచి కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో 2003లో కోర్టు అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి అతడి ఆచూకీ కనిపెట్టాలంటూ పోలీసులను ఆదేశించింది.

అతడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు దీపక్ ఉండే కాందివలీకి వెళ్లి విచారించారు. అతడు చనిపోయి ఉండొచ్చని స్థానికులు చెప్పేవారు. అయినప్పటికీ పోలీసులు పట్టువిడవకుండా అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా దీపక్ భార్య ఫోన్ నంబర్ సంపాదించారు. దానిపై నిఘాపెడితే వారు 60 కిలోమీటర్ల దూరంలోని నాలాసొపారలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మూడు దశాబ్దాలలో అతడు పలు స్థావరాలు మార్చినట్టు గుర్తించారు. నాలాసొపారాలో అతడు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రెండేళ్లుగా కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News