ఐఐటీ విద్యార్థిని వివస్త్రను చేసి, వీడియో తీసి లైంగిక వేధింపులు.. పార్టీ నుంచి ముగ్గురు బీజేపీ కార్యకర్తల బహిష్కరణ

  • ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘటన
  • ఐఐటీ-బీహెచ్‌యూ క్యాంపస్‌లోనే వేధింపులు  
  • రెండు నెలల తర్వాత విషయం వెలుగులోకి
  • విద్యార్థుల ఆందోళనతో నిందితుల అరెస్ట్ 
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రెండునెలల క్రితం జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థినిపై ముగ్గురు బీజేపీ కార్యకర్తలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. దీంతో వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ వారణాసి జిల్లా అధ్యక్షుడు హన్సరాజ్ విశ్వకర్మ తెలిపారు. అయితే, వారి హోదాను కానీ, పార్టీలో వారి పాత్ర గురించి మాత్రం కానీ వెల్లడించలేదు. నిందితులను కునాల్ పాండే, ఆనంద్ అలియాస్ అభిషేక్ చౌహాన్, సాక్షం పటేల్‌గా గుర్తించి వారణాసి పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. కోర్టు వారికి ఈ నెల 14 వరకు రిమాండ్ విధించింది. 

ఐఐటీ-బనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థిని నవంబరు 2 తెల్లవారుజామున లైంగిక వేధింపులకు గురైంది. బైక్‌పై వచ్చిన నిందితులు క్యాంపస్‌లోనే ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. నిందితులు ఆమె దుస్తులు విప్పి ఆ ఘటనను వీడియో తీశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థి సంఘం ఆందోళనలు చేసింది. బాధితురాలికి న్యాయం కావాలని డిమాండ్ చేసింది. క్యాంపస్‌లో భద్రత పెంచాలని ఆందోళనకు దిగారు. ఈ ఘటన యూపీలో రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నిందితులకు పార్టీ అండగా నిలుస్తోందని ఆరోపించారు.


More Telugu News