పీజీలో గోల్డ్ మెడల్ సాధించిన కడప జైలు ఖైదీ

పీజీలో గోల్డ్ మెడల్ సాధించిన కడప జైలు ఖైదీ
  • ఓ అమ్మాయి హత్యకేసులో మహ్మద్ రఫీకి జీవితఖైదు
  • రఫీ స్వస్థలం నంద్యాల మండలం సోముల గ్రామం
  • 2014లో రఫీ బీటెక్ చదువుతుండగా ఘటన
  • 2019లో కోర్టు తీర్పు... కడప జైలుకు తరలించిన పోలీసులు
  • దూరవిద్యా విధానంలో ఎంఏ సోషియాలజీ చదివిన రఫీ
ఓ హత్య కేసులో జీవితఖైదు శిక్ష పడి, జీవితంపై ఆశ కోల్పోయిన వారు మానసికంగా కుంగిపోతారు. కానీ మహ్మద్ రఫీ వంటి వ్యక్తులు మాత్రం పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచి అనుకున్నది సాధిస్తారు. 

కడప సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న మహ్మద్ రఫీ పీజీలో గోల్డ్ మెడల్ సాధించడం ఓ వ్యక్తి దృఢ సంకల్పానికి, చదువుపై మమకారానికి అద్దం పడుతుంది. మహ్మద్ రఫీ స్వస్థలం నంద్యాల జిల్లా సంజామల మండలంలోని సోముల గ్రామం. రఫీ 2014లో బీటెక్ చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయి హత్యకేసులో ఇరుక్కున్నాడు. ఓ ప్రేమ వ్యవహారంలో  తమ గ్రామానికే చెందిన అమ్మాయి హత్యకు కారకుడయ్యాడంటూ అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

2019లో కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. దాంతో మహ్మద్ రఫీని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, అక్కడి అధికారుల ప్రోత్సాహంతో మళ్లీ పుస్తకాలు పట్టిన రఫీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూరవిద్యా విధానం ద్వారా ఎంఏ సోషియాలజీలో చేరాడు. జైలు సిబ్బంది సాయంతో పుస్తకాలు సేకరించి, ప్రతి రోజూ ఎంతో కష్టపడి చదివాడు. 

2022లో జరిగిన పీజీ పరీక్షల్లో మహ్మద్ రఫీ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచాడు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ నిర్వహించిన స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు అతడికి కోర్టు అనుమతితో నాలుగు రోజుల బెయిల్ లభించింది. 

ఈ నేపథ్యంలో, స్నాతకోత్సవానికి హాజరైన రఫీ... అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జగదీష్ చేతులమీదుగా పీజీ పట్టా, గోల్డ్ మెడల్ అందుకున్నాడు. చదువుపై మమకారంతోనే ఈ ఘనత సాధించగలిగానని, తన గోల్డ్ మెడల్ ను తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నానని రఫీ వెల్లడించాడు.


More Telugu News