పాక్ ఎన్నికల నుంచి ఇమ్రాన్ ఖాన్ ఔట్

  • మాజీ ప్రధాని నామినేషన్ తిరస్కరించిన ఎలక్షన్ కమిషన్
  • అవినీతి కేసుల్లో జైలుపాలవడమే కారణమని సమాచారం
  • రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ వేసిన ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలలో ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయకుండా పాక్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్‌ (ఎన్‌ఏ- 122), మియావలీ (ఎన్‌ఏ- 89) స్థానాల నుంచి ఇమ్రాన్ ఖాన్ నామినేషన్‌ వేశారు. అయితే, తోషాఖానా కేసులో కోర్టు ఆయనను దోషిగా తేల్చి జైలుకు పంపడంతో పాటు ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. దీంతో ఎన్నికల సంఘం ఇమ్రాన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తిరస్కరించింది.

పాకిస్థాన్ లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దరఖాస్తు, పరిశీలన ప్రాసెస్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి, మరో మాజీ మంత్రి హమ్మద్ అజర్ లు కూడా ఉన్నారు. అయితే, వారు దాఖలు చేసిన నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అవినీతి కేసులో ఇమ్రాన్ జైలు పాలవడంతో ఆయన నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి.

దీంతో ఇమ్రాన్ ఖాన్ నామినేషన్లను తిరస్కరించినట్లు ఈసీ ప్రకటించింది. మహమూద్ ఖురేషి, హమ్మద్ అజర్ ల నామినేషన్లు కూడా చెల్లవని ప్రకటించింది. అయితే, ఈసీ నిర్ణయంపై జనవరి 3 లోపు అప్పీల్ చేసుకునే సౌలభ్యం ఉందని, వారి అప్పీల్ పై జనవరి 10 లోపు అప్పిలేట్ ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.


More Telugu News