కేసు కొట్టేయండి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ వివేకా కుమార్తె సునీత

  • వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో సునీత, రాజశేఖరరెడ్డిపై కేసు
  • తాము ఎలాంటి తప్పు చేయలేదని వివరణ
  • తమను వేధించేందుకే కేసు పెట్టారని ఆరోపణ
  • పులివెందుల కోర్టు పోలీసులకు పంపిన ఫిర్యాదు చెల్లుబాటు కాదన్న పిటిషనర్లు
మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి పీఏ ఫిర్యాదుతో పులివెందుల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో  పులివెందులకు చెందిన కొందరి ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్, సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో వారిపై కేసు నమోదైంది. 

ఈ సందర్భంగా సునీత, రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, తమను వేధించేందుకే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఫిర్యాదుదారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలం నమోదు చేయకుండానే పులివెందుల కోర్టు ఫిర్యాదును పోలీసులకు పంపిందన్నారు. ఇది చెల్లుబాటుకాదని తెలిపారు. ఎఫ్ఐఆర్‌‌లో పేర్కొన్న అంశాలు తమకు వర్తించబోవని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుడు పేర్కొన్న విషయాల్లో తాము నేరానికి పాల్పడినట్టు కనిపించడం లేదని తెలిపారు.

తాము నేరానికి పాల్పడినట్టు ఎలాంటి కారణాలు పేర్కొనకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు పంపడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. తమపై పగతో, స్థానికుల ప్రమేయంతోనే తప్పుడు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌తోపాటు తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.


More Telugu News