అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న హామీ ఏమైంది?: సీఎం జగన్ కు లోకేశ్ లేఖాస్త్రం

  • అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై సీఎంను నిలదీసిన లోకేశ్
  • జగన్ పాలనలో 600 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారన్న లోకేశ్
  • రూ.10 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీత
  • ఇదేనా మీ మానవత్వం? అంటూ లేఖ 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై సీఎం జగన్ కు లేఖాస్త్రం సంధించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానన్న హామీ ఏమైందని సీఎం జగన్ ను లోకేశ్ నిలదీశారు. 

మీ పాలనలో 600 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారు... హామీ ఇచ్చిన మేరకు అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్క కుటుంబానికైనా రూ.10 లక్షల సాయం ఇచ్చారా? ఇదేనా మీ మానవత్వం? అని ప్రశ్నించారు. 

"మీరు (జగన్) విపక్ష నేతగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ వ్యవహారంలో మా ప్రభుత్వంపై చిమ్మిన విషం మాకింకా గుర్తుంది. మీరు చేసిన ఆరోపణలు మేమింకా మర్చిపోలేదు" అంటూ లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. 

నాడు వైఎస్ హయాంలోనే అగ్రిగోల్డ్ పుట్టిందని, ఆయన హయాంలోనే అగ్రిగోల్డ్ స్కాం జరిగిందని ఆరోపించారు. "2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక అగ్రిగోల్డ్ కు చెందిన 21 వేల ఎకరాల ఆస్తులు జప్తు చేశాం... యాజమాన్యాన్ని అరెస్ట్ చేయించాం... బాధితులకు న్యాయం చేశాం... అయినా మాపై దుర్మార్గంగా ఆరోపణలు చేశారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేశారు. పాదయాత్రలో వారు నా ముందు తమ ఆవేదన వెలిబుచ్చారు" అని లోకేశ్ వివరించారు.


More Telugu News