పవన్ కల్యాణ్ ను కలవడంపై వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వివరణ

  • కాకినాడలో మకాం వేసిన పవన్ కల్యాణ్
  • గతరాత్రి పవన్ ను కలిసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
  • పవన్ పిలిస్తేనే వెళ్లానని చంటిబాబు వెల్లడి
  • జిల్లా రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారని స్పష్టీకరణ
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇన్చార్జిల మార్పు వ్యవహారం వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తోంది. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా నిరసన గళాలు వినిపిస్తున్నారు! ఈ క్రమంలో కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పిలిస్తేనే వెళ్లి కలిశానని జ్యోతుల చంటిబాబు స్పష్టం చేశారు. పవన్ జిల్లా రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. 

కాగా, ఈసారి టికెట్ పై భరోసా లేకపోవడంతో, చంటిబాబు వైసీపీకి గుడ్ బై చెబుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు తెలుస్తోంది. 

వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు వేచి చూడాలని చంటిబాబు భావిస్తున్నట్టు సమాచారం. జాబితాలో తన పేరు లేకపోతే పార్టీ మార్పు అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక అని తెలుస్తోంది.


More Telugu News