కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

  • ఉగ్రవాద సంస్థ ‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’లో లఖ్‌బీర్ సభ్యుడిగా ఉన్నాడని కేంద్ర హోంశాఖ వెల్లడి
  • దేశవ్యాప్తంగా అతడిపై అనేక కేసులు ఉన్నాయని తెలిపిన కేంద్రం
  • ప్రస్తుతం కెనడాలోని ఎడ్మంటన్‌లో నివాసం ఉంటున్నాడని ప్రస్తావన
కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు ఉగ్రదాడులు, దోపిడీలు, హత్యలు, ఐఈడీలు అమర్చడం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సహా పంజాబ్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి ఘటనల్లో ప్రమేయం ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అతడు అల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో నివసిస్తున్నాడని తెలిపింది. ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందినవాడని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. కాగా లఖ్‌బీర్ సింగ్ తండ్రి పేరు నిరంజన్ సింగ్, తల్లి పేరు పర్మీందర్ కౌర్‌ అని తెలిపింది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థ జాబితాలో ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

కాగా 2021లో మొహాలీలోని పంజాబ్ స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్ భవనంపై జరిగిన దాడి ఘటనలో లఖ్‌బీర్ సింగ్ లాండా ప్రమేయం ఉంది. ఓ సరిహద్దు ఏజెన్సీ సాయం అందించడంతో అతడు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు సరిహద్దు అవతల నుంచి పేలుడు పదార్థాలు, అధునాతన ఆయుధాలను సరఫరా చేయడంలో అతడి భాగస్వామ్యం ఉందని తేలింది. పలు ఉగ్రదాడులు, దోపిడీలు, హత్యలు, ఐఈడీలు అమర్చడం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు పంజాబ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి ఘటనల్లో లఖ్‌బీర్ సింగ్ లాండాపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. లాండా, అతడి అనుచరులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపీడీలతోపాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ పేర్కొంది. పంజాబ్ రాష్ట్రంలో శాంతి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపింది. అతడిపై ఓపెన్-ఎండెడ్ వారెంట్ కూడా జారీ అయ్యింది.


More Telugu News