ఇవాళ కూడా కొనసాగిన వైసీపీ 'ఇన్చార్జి' కసరత్తులు!

  • ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
  • పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చుతున్న వైసీపీ హైకమాండ్
  • వచ్చే పోయే నేతలతో రద్దీగా మారిన తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం
ఏపీలో రెండోసారి కూడా అధికారంలోకి రావాలని సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. అందుకే, కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం ఉంటే తప్ప ఎవరికీ కూడా సీఎం జగన్ టికెట్ పై భరోసా ఇవ్వడంలేదు. నమ్మకం లేని వివిధ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చుతున్నారు. 

తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం గత కొన్నిరోజులుగా నియోజకవర్గ ఇన్చార్జి నియామకాల కసరత్తులకు వేదికగా నిలుస్తోంది. రోజుకు కొంతమంది నేతలను పిలిపించి నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుపై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. 

ఇవాళ కూడా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ తో మాట్లాడి వెళ్లారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయవాడ (ఈస్ట్) నేత దేవినేని అవినాశ్ లతో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. 

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తదితరులు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇక ఇప్పటికే చాలా నియోజకవర్గాల ఇన్చార్జిలపై కసరత్తు పూర్తయినట్టు సమాచారం.


More Telugu News