వ్యూహం సినిమాకు ప్రతివ్యూహం ఉండకూడదనుకుంటే ఎలా?: నారా లోకేశ్

  • వర్మ కోసం కోర్టులో వైసీపీ ఎంపీ వాదనలు వినిపిస్తున్నారన్న లోకేశ్
  • ఇలాంటి సినిమాలకు జగన్ ఫండింగ్ చేస్తున్నారని ఆరోపణ
  • తప్పులు చేస్తున్న పోలీసు అధికారుల గురించే రెడ్ బుక్ లో రాస్తున్నానని వ్యాఖ్య
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమాపై టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి సినిమాలను తీయడం ఫ్యాషన్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి సినిమాలకు సీఎం జగన్ ఫండింగ్ చేస్తున్నారని ఆరోపించారు. 'వ్యూహం' సినిమా కోసం వర్మ తరపున తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నది కూడా వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డేనని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఈ సినిమా ఎలా ఉంటుందో ఎవరికైనా అర్థమవుతుందని చెప్పారు. వర్మ నిజంగా సినిమా తీయాలకుంటే కోడి కత్తి, హూ కిల్డ్ బాబాయ్, ప్యాలస్ లో జరుగుతున్న అవినీతి... ఇలాంటి అంశాలపై తీసుకోవచ్చని అన్నారు. 

తాను రాస్తున్న రెడ్ బుక్ గురించి లోకేశ్ మాట్లాడుతూ... చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసు అధికారుల గురించే రెడ్ బుక్ లో రాస్తున్నానని చెప్పారు. తప్పులు చేసిన వారి గురించి తాను మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు. అధికారులు తప్పుడు పనులు చేసినా మాట్లాడకూడదా? అని మండిపడ్డారు. సీఐడీనే స్క్రిప్ట్ ఇవ్వమనండి.. లేదా సజ్జల వంటి వాళ్లను స్క్రిప్ట్ ఇవ్వమనండి... వాళ్ల స్క్రిప్ట్ నే చదువుతానని చురక అంటించారు. కొల్లి రఘురామిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వాళ్ల పేర్లు తన రెడ్ బుక్ లో ఉన్నాయని వీళ్లకు ఎలా తెలుసని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంటే... వీళ్లు తప్పులు చేశారని ఒప్పుకుంటున్నట్టేనా? అని ప్రశ్నించారు.


More Telugu News