గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి అంబటి రాయుడు పోటీ?
- ఆరు నెలలుగా నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్న మాజీ క్రికెటర్
- గుంటూరు లోక్‌సభ సీటు ఖాయమంటూ చాలా కాలంగా ప్రచారం
- వైసీపీలో చేరికతో మరోసారి తెరపైకి వచ్చిన ప్రచారం
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ నాయకుడిగా మారిపోయిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. పార్టీ నుంచి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి గత కొంతకాలంగా ఈ ప్రచారం ఉంది. గత ఆరు నెలలుగా గుంటూరు లోక్‌సభ పరిధిలో అంబటి రాయుడు విస్తృతంగా పర్యటిస్తుండడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణంగా ఉంది. ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వైసీపీ నేతలను పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దీంతో గుంటూరు లోక్‌సభ సీటు ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.