విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం.. ప్రాణాపాయ స్థితిలో యువకుడు

విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం.. ప్రాణాపాయ స్థితిలో యువకుడు
  • ఆల్జీరియా నుంచి పారిస్‌లోని ఓర్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన విమానంలో గురువారం ఘటన
  • విమాన తనిఖీల సందర్భంగా ల్యాండింగ్ గేర్‌ కంపార్ట్‌మెంట్‌లో కనిపించిన యువకుడు
  • యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలింపు
  • ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణాలు ప్రాణాంతకమంటున్న నిపుణులు
విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో (విమానం చక్రాలు ఉండే ప్రదేశం) ప్రయాణించి ప్రాణాపాయాంలో పడ్డాడో యువకుడు. పారిస్‌లో గురువారం ఈ ఘటన వెలుగు చూసింది. ఆల్జీరియా నుంచి ఓర్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ కమర్షియల్ విమానాన్ని తనిఖీ చేస్తుండగా అధికారులు ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లోని యువకుడిని గుర్తించారు. తీవ్ర అనారోగ్యం పాలైన అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హైపోథర్మియా బారిన పడ్డ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. అతడి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డు లభించలేదని పేర్కొన్నారు. 

కమర్షియల్ విమానాలు 30 వేల నుంచి 40 వేల అడుగుల ఎత్తున మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రయాణిస్తుంటాయి. అక్కడ గాల్లో ఆక్సిజన్ స్థాయులు కూడా అత్యల్పంగా వుంటాయి. ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు వీలుగా విమానంలో ప్రయాణికులు ఉండే క్యాబిన్‌లో ఆక్సిజన్ సరఫరా, హీటింగ్ వ్యవస్థలు ఉంటాయి. లాండింగ్ కంపార్ట్‌మెంట్‌లో ఈ వ్యవస్థలు లేని కారణంగా అందులో ప్రయాణించే వారు బతికిబట్టకట్టడం కష్టమని వైమానిక రంగ నిపుణులు చెబుతున్నారు. వీసాలు, ఇతర అనుమతులు లేని కొందరు అక్రమమార్గాల్లో గమ్యస్థానాలను చేరుకునేందుకు ఇలాంటి ప్రాణాంతక ప్రయాణాలు చేస్తుంటారు. 

అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరాల ప్రకారం, 1947 నుంచి 2021 మధ్య కాలంలో సుమారు 132 మంది ఇలా ల్యాండింగ్ గేర్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించి అధికారులకు చిక్కారు.


More Telugu News