అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా ట్రంప్‌పై అనర్హత వేటు వేసిన మైన్ రాష్ట్రం

  • ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్‌కు అనర్హుడని నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల అధికారి
  • 2021లో క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించిన కారణంగా నిర్ణయమని వెల్లడి
  • ఇదే కారణంతో ఇటీవలే అనర్హత విధించిన కొలరాడో రాష్ట్రం
వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. కొలరాడో తర్వాత మరో రాష్ట్రం ఆయనపై అనర్హత వేటు వేసింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్‌కు ట్రంప్ అనర్హుడంటూ మైన్ రాష్ట్రం గురువారం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 6, 2021న రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో ట్రంప్ పాత్ర ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ట్రంప్‌పై అనర్హత విధించిన రెండో రాష్ట్రంగా మైన్ నిలిచింది. అంతక్రితం కొలరాడో రాష్ట్రం ట్రంప్‌పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. 

రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తులు తిరుగుబాటు లేదా విప్లవంలో పాల్గొంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు అవుతారని పేర్కొంటున్న అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ట్రంప్‌పై అనర్హత వేటు వేయాలంటూ మైన్ రాష్ట్ర మాజీ చట్టసభ సభ్యుల బృందం ఇటీవలే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నిర్ణయం వెలువడింది. నిజానికి 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నామినేషన్‌లో ట్రంప్ ముందున్నారు. అయితే 2020 ఎన్నికల్లో మోసం జరిగిందంటూ క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించడం ఆయనకు తలనొప్పిగా మారింది. ఓటర్ల తీర్పు ధ్రువీకరించకుండా చట్టసభ్యులను అడ్డుకోవాలంటూ తన మద్ధతుదారులను క్యాపిటల్ భవనం మీదకు ట్రంప్ ఎగదోశారని మైన్ రాష్ట్ర సెక్రటరీ ఆఫ్ స్టేట్, డెమొక్రాటిక్ నేత షెన్నా బెల్లోస్ అన్నారు. 

ఇదిలావుంచితే, డిసెంబరు 19న కొలరాడో కూడా ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది. రాష్ట్ర ప్రైమరీ బ్యాలెట్ నుండి అనర్హులుగా ప్రకటించింది. క్యాపిటల్ భవనంపై దాడిలో పాల్గొనడంతో అధ్యక్ష పదవికి అనర్హులుగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. కాగా కొలరాడో తీర్పును డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.


More Telugu News