పొగమంచు కౌగిలిలో ఉత్తరాది.. రైళ్లు, విమానాల ఆలస్యం

  • మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణశాఖ
  • 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
  • కొన్ని విమాన సర్వీసుల రద్దు.. మరికొన్ని ఆలస్యం
ఉత్తరాది మరోమారు మంచుదుప్పట్లో ముడుచుకుపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాదిన మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాతి నుంచి మంచు ప్రభావం క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. 

మంచు ప్రభావం ఉత్తరాది నుంచి నడిచే పలు రైళ్లు, విమానాలపై పడింది. కొన్ని రైళ్లు, విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ-హౌరా మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ సహా డజన్ల కొద్దీ రైళ్లు 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.  విమాన సర్వీసుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. 


ఢిల్లీలో నిన్న ఉష్ణోగ్రత 8.4 డిగ్రీలకు పడిపోగా ఈ రోజు కొంత మెరుగై 10.7 డిగ్రీలు నమోదైంది. వచ్చే ఐదు రోజులు ఇది మళ్లీ 7 నుంచి 8 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. నిన్న దేశంలో సాధారణంగా కంటే కొద్దిగా ఎక్కువగా 21.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


More Telugu News