గాజా కష్టాలు.. గర్భవతి కాలినడకన 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం

  • గాజాలో ప్రెగ్నెంట్ మహిళ కష్టాలు
  • యుద్ధం మొదలైన కొన్ని రోజులకే సొంతింటిని కాలినడకన వీడిన గర్భవతి
  • డిసెంబర్ 18న సిజేరియన్ ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చిన వైనం
  • స్థానిక కాందిశీకుల శిబిరంలో మహిళ, నవజాత శిశువుల నివాసం
  • సరైన వసతులు లేక నరకం, భార్యాబిడ్డలను ఆదుకోలేని నిస్సహాయ స్థితిలో భర్త
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా సామాన్యులు కడగళ్లపాలవుతున్నారు. ఇటీవల గాజాలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన ఓ మహిళ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించలేక తల్లడిల్లిపోతోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ దాడి జరిపిన కొన్ని రోజులకే ఇమాన్ తన పిల్లలు, భర్త, ఇతర కుటుంబసభ్యులతో కలిసి బెయిట్ హానూన్‌‌లోని తన ఇంటిని వదిలి సురక్షిత ప్రాంతానికి బయలుదేరింది. అప్పటికి ఆమె 6 నెలల గర్భవతి. రవాణా సదుపాయం కోసం వెతుకుతూనే ఆమె ఐదు కిలోమీటర్ల దూరంలోని జాబాలియా శరణార్థ శిబిరానికి కాలినడకన చేరుకుంది. ఆ తరువాత దక్షిణాన ఉన్న మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలనేది ఆమె ఆలోచన. గర్భవతి అయి ఉండీ ఆమె ఇంత దూరం కాలినడకన ప్రయాణించడంతో ఆమె ప్రెగ్నెన్సీపై ప్రభావం పడింది.

డిసెంబర్ 18న ఇమాన్ సిజేరియన్ ద్వారా నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తరువాత..బరువు తక్కువగా పుట్టిన ఓ శిశువు మినహా ఇమాన్, ఆమె పిల్లలను ఆసుపత్రి వర్గాలు పంపించేశాయి. యుద్ధంలో గాయపడ్డ వారికి చికిత్స కోసం ఆమెను పంపించకతప్పలేదు. ప్రస్తుతం ఇమాన్ స్థానికంగా ఉన్న ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరంలో ఆశ్రయం పొందింది. అపరిశుభ్ర, దుర్గంధభూయిష్ట వాతావరణంలోనే నవజాత శిశువుల ఆలనాపాలనా చూస్తోంది. 

తినడానికి తిండి కూడా లేని ఇమాన్‌కు తల్లిపాలపై ఆధారపడ్డ శిశువులను సాకడం కష్టంగా మారింది. సరైన పోషణ లేక పిల్లలు అల్లాడిపోతుంటే చూసి ఇమాన్ భర్త తట్టుకోలేక పోతున్నాడు. భార్యాపిల్లలను ఆదుకోలేని తన దుర్భరస్థితిని తలుచుకుని కుమిలిపోతున్నాడు. వారం, లేదా రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోతుందని ఇమాన్ తొలుత భావించింది. కానీ, కనుచూపు మేరలో యుద్ధానికి ముగింపు లేకపోవడంతో ఆమె ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. తన ఇంటిని మరెన్నడూ చూడలేనేమో అంటూ ఆమె మీడియాతో ఆవేదన వ్యక్తం చేసింది.


More Telugu News