పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయాం: రోహిత్ శర్మ

  • దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం
  • గెలిచేంత ఆటతీరును తాము కనబర్చలేదని అంగీకరించిన రోహిత్ శర్మ
  • బంతితో రాణించలేకపోయామని వెల్లడి
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నేడు మూడో రోజే మ్యాచ్ ఫలితం తేలింది. మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ, పరిస్థితులకు తగ్గట్టుగా ఆటతీరు మార్చుకోవడంలో విఫలమయ్యామని అంగీకరించాడు. 

ఏమంత టెస్టు అనుభవంలేని శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణలను ఈ మ్యాచ్ లో ఆడించడం పట్ల రోహిత్ స్పందిస్తూ... వారిని తానేమీ తప్పుబట్టడంలేదని స్పష్టం చేశాడు. ఏదేమైనా ఈ టెస్టులో నెగ్గేందుకు అవసరమైన ఆటతీరును తాము కనబర్చలేదని అన్నాడు. 

తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో ఫర్వాలేదనిపించే స్కోరు సాధించామని, కానీ బంతితో రాణించలేకపోయామని రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వైఫల్యం ఓటమికి దారితీసిందని అభిప్రాయపడ్డాడు. 

ఇవాళ కోహ్లీ అద్భుతంగా ఆడాడని, కానీ టెస్టుల్లో గెలవాలంటే సమష్టి కృషి అవసరమని పేర్కొన్నాడు. ఈ ఓటమికి తామేమీ కుంగిపోవడంలేదని, రెండో టెస్టుకు తప్పకుండా పుంజుకుంటామని రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.


More Telugu News