అందమే ఆమెకి ఆభరణం .. న్యూ ఇయర్ పై ఆషిక రంగనాథ్ ఆశలు!
- 'అమిగోస్'తో పరిచయమైన ఆషిక రంగనాథ్
- గ్లామర్ పరంగా మార్కులు కొట్టేసిన బ్యూటీ
- 'నా సామిరంగ'లో ప్రాధాన్యత కలిగిన పాత్ర
- హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్న సుందరి
ఆషిక రంగనాథ్ .. ఈ పేరును కుర్రకారు ఇంకా మరిచిపోలేదు. అలా అని చెప్పి తెలుగులో ఆమె చేసిన ఫస్టు మూవీ 'అమిగోస్' జనంలోకి దూసుకుని వెళ్లలేదు. పోనీ ఆమె నటన కారణంగా అలా గుర్తుండిపోయిందా అంటే, ఆ సినిమాలో ఆమె పాత్రకి అంత ప్రాధాన్యత లేదు. మరి ఎందుకు ఈ బ్యూటీ గుర్తుండిపోయింది అంటే .. బ్యూటీ కావడం వల్లనే. అందగత్తె కావడం వలన ఆమె 'అమిగోస్'లో అందాలు ఆరబోసిందా అంటే అలాంటిదేం జరగలేదు. ఆ సినిమా కోసం 'ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదీ వెన్నెలమ్మా' అనే పాటను రీమిక్స్ చేశారు. ఆ పాట ఎవరి గ్రీన్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కానీ ఆ పాట అయిపోయేంత వరకూ ఆడియన్స్ అందరి చూపు ఆషిక పైనే ఉంటుంది. ఆ సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులంతా ఈ మధ్య కాలంలో ఇంత బ్యూటీని చూడలేదని అన్నారు. జనంలో ఆ క్రేజ్ కారణంగానే ఆమెకి 'నా సామిరంగ' సినిమాలో ఛాన్స్ దక్కింది. అది కూడా చాలా విషయం ఉన్న రోల్ కావడం విశేషం. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే పట్టుదలతో నాగ్ ఉన్నారు. కొత్త ఏడాది ఆరంభంలో వచ్చే ఈ సినిమా తనకి స్టార్ డమ్ ను తెచ్చిపెడుతుందనే ఆశతో ఆషిక ఉంది.