"పవర్ ఫుల్ కపుల్"... రామ్ చరణ్, ఉపాసనపై ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రత్యేక కథనం

  • సెలెబ్రిటీ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఉపాసన
  • తమ కెరీర్ లో ఉన్నతస్థాయిలో కొనసాగుతున్న జోడీ
  • తమ వ్యక్తిత్వాలను కాపాడుకుంటూనే వృత్తిలో ఎదిగారని కితాబు
ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ వరకు వెళ్లిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. అటు, ఉపాసన భర్తకు తగ్గ భార్యగా, మెగా ఇంటి కోడలిగా, వ్యాపారవేత్తగా బహుముఖ పాత్రలు సమర్థంగా పోషిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులపై సుప్రసిద్ధ మీడియా సంస్థ ఫోర్బ్స్ ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది. 

భారతదేశంలోని కొన్ని శక్తిమంతమైన జంటల్లో రామ్ చరణ్-ఉపాసన జోడీ కూడా ఒకటని పేర్కొంది. వారిద్దరి వ్యక్తిత్వాలను, ఓ జంటగా వారి పయనాన్ని తన కథనంలో వివరించింది. ఇద్దరూ భిన్న ప్రపంచాల నుంచి వచ్చారని, ఒకరు సినీ సూపర్ స్టార్ అని, మరొకరు వ్యాపారవేత్త-దాత అని ఫోర్బ్స్ వివరించింది. అయినప్పటికీ, పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాక ఒకరికి ఒకరం అన్నట్టుగా కలిసి ప్రయాణం చేస్తున్నారని, ఒకరి విజయం కోసం మరొకరు కృషి చేస్తూ దాంపత్య జీవితానికి సరైన అర్థం చెబుతున్నారని కొనియాడింది. 

వివాహ బంధంలో భార్య, భర్తగా తమ బాధ్యతలు నిర్వరిస్తున్నప్పటికీ, తమ కెరీర్ లను ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు దూసుకెళ్లడం ఉపాసన, రామ్ చరణ్ ల జీవితాల్లో కనిపిస్తుందని ఫోర్బ్స్ పేర్కొంది. 

అపోలో హాస్పిటల్స్ సామాజిక సేవాల విభాగం వైస్ చైర్ పర్సన్ గా, యూఆర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకురాలిగా ఉపాసన... తెలుగు సినిమా రంగంలో అగ్రశ్రేణి హీరోగా, ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని కెరీర్ ను ఉన్నతస్థాయిలో చరణ్ కొనసాగిస్తున్నాడని వివరించింది. 

ఈ ఇద్దరూ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే స్నేహితులని, 2012లో పెళ్లి చేసుకున్నారని ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ లో  ఈ దంపతులకు క్లీంకార అనే పాప జన్మించిందని తెలిపింది. 

"ఇద్దరి వృత్తిగతమైన జీవితాల్లో భిన్నమైన సవాళ్లు నెలకొని ఉంటాయి. కానీ ఒకరికి కష్టం వస్తే మరొకరు అండగా నిలుస్తారు, ఒకరికి సంతోషం కలిగితే ఇద్దరూ పంచుకుంటారు. వీరిద్దరి అనుబంధానికి నమ్మకం, పరస్పర గౌరవమే పునాదులు. కాలం గడిచేకొద్దీ వీరి బంధం మరింతగా బలపడడానికి ఈ పునాదులే కారణం" అని పేర్కొంది.

"ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి... నా జీవితం విషయానికొస్తే ఉపాసన వచ్చాకే ఓ నిలకడ అనేది ఏర్పడింది అని రామ్ చరణ్ చెబుతారు. ఆమె చెప్పేది నేను శ్రద్ధగా వింటాను... నా కెరీర్ కు సంబంధించిన అంశాలను చక్కదిద్దడంలో ఉపాసనదే ప్రముఖ పాత్ర అని చరణ్ అంటారు. 

ఇక ఉపాసన అయితే... తాను ఎంచుకున్న లక్ష్యాలను సాధించే పూర్తి స్వేచ్ఛను చరణ్ కల్పించాడని చెబుతారు. మనసులో ఉన్నది ఉన్నట్టు, ఏదీ దాచుకోకుండా, ఎలాంటి సంకోచాలు లేకుండా చెప్పే వ్యక్తి నా జీవితంలో రామ్ చరణ్. అతడు చెప్పేదాన్ని నేను చాలా శ్రద్ధగా వింటాను. అతడు ఏం చెప్పినా నేను ప్రశ్నించను అని ఉపాసన అంటారు" అని ఫోర్బ్స్ తన కథనంలో వివరించింది. 

మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి గ్లామర్ ప్రపంచంలో పెరిగాడని, కుర్రాడిగా ఉన్నప్పుడు గుర్రపుస్వారీ, క్రికెట్, ఆటోమొబైల్ రంగంపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శించేవాడని వెల్లడించింది. ఓ దశలో రామ్ చరణ్ ఆటోమొబైల్ ఇంజినీర్ కావాలనుకున్నాడని చిరంజీవి చెప్పారు... అయితే, కాలేజీ విద్యాభ్యాసం పూర్తయ్యాక నటనపై ఆసక్తి పెంచుకున్నాడని ఫోర్బ్స్ తెలిపింది. 

ఇక రామ్ చరణ్ తన ప్రధాన బలం ఏంటో కూడా ఈ మ్యాగజైన్ కు వెల్లడించారు. సినీ రంగంలో ఎంతో ఒత్తిడి ఉంటుందని, అయితే, ఒత్తిడిని పట్టించుకోకుండా పనిచేసుకుంటూ పోవడమే తన ప్లస్ పాయింట్ అని తెలిపారు. సినీ యాక్టర్ జీవితం ఎలా ఉంటుందో తెలిసి కూడా ఉపాసన తన జీవితంలోకి రావడం ఒక సాహసోపేత నిర్ణయంగా రామ్ చరణ్ అభివర్ణించారు. 

సంస్కృతి పరంగా పూర్తిగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఒక షాక్ వంటిదని ఉపాసన పేర్కొన్నారు. అయితే పెళ్లి తర్వాత ఈ సాంస్కృతిక అంతరం తొలగిపోయేందుకు తన తల్లి, అత్తగారు ఎంతో తోడ్పాటు అందించారని ఉపాసన తెలిపారు. అత్తగారింట తాను ఎలాంటి ఆంక్షలు ఎదుర్కోలేదని, పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారని ఆమె సంతోషంగా చెప్పారు. 

ఇక, మెగాస్టార్ చిరంజీవి కూడా రామ్ చరణ్-ఉపాసన దంపతుల గురించి ఏం చెప్పారో ఫోర్బ్స్ తన కథనంలో పేర్కొంది. 

"వారిద్దరూ ఒకరినొకరు అభినందించుకోవడం చూడముచ్చటగా ఉంటుంది. రామ్, ఉపాసన ఇద్దరూ కూడా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. వారి ఆలోచనల్లో ఎంతో పరిణతి కనిపిస్తుంది. వారి ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లు ఎలా ఉంటాయో వారికి తెలుసు. ఉపాసన వృత్తిపరంగా ఏమేం చేయాలనుకుంటుందో వాటన్నింటికి రామ్ మద్దతుగా నిలుస్తాడు. ఉపాసన తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని ఎంత సమతుల్యతతో కొనసాగిస్తుందో చూస్తే ఓ అద్భుతంలా అనిపిస్తుంది అని చిరంజీవి పేర్కొన్నారు" అంటూ ఫోర్బ్స్ వివరించింది.


More Telugu News