లంచ్ సమయానికి 147 పరుగుల ఆధిక్యంలో దక్షిణాఫ్రికా... టీమిండియాకు కలిసిరాని పరిస్థితులు!

  • సెంచురియన్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు
  • ఆటకు నేడు మూడో రోజు
  • లంచ్ వేళకు తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 392 పరుగులు చేసిన సఫారీలు
  • 185 పరుగులు చేసిన ఓపెనర్ డీన్ ఎల్గార్
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టులో నేడు మూడో రోజు ఆట జరుగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 256-5తో నేడు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య దక్షిణాఫ్రికా లంచ్ సమయానికి 7 వికెట్లకు 392 పరుగులు చేసింది. 

సెంచరీ హీరో డీన్ ఎల్గార్ 185 పరుగులు చేసి ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రీజులో పాతుకుపోయిన డీన్ ఎల్గార్ ను ఎట్టకేలకు శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. అప్పటికే ఎల్గార్ 28 బౌండరీలు బాది భారత బౌలర్లను నిరాశకు గురిచేశాడు. అతడికి లెఫ్టార్మ్ సీమర్ మార్కో యన్సెన్ నుంచి చక్కని సహకారం లభించింది. యన్సెన్ 120 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 72 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. 

యువ పేసర్ గెరాల్డ్ కోట్జీ కూడా క్రీజులోకి వచ్చీ రావడంతోనే బాదుడు షురూ చేశాడు. కోట్జీ 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 19 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, అశ్విన్ 1 వికెట్ తీశారు. 

ప్రస్తుతం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 147 పరుగులు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News