దుబాయ్ పారిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు.. సాహిల్‌ను తప్పించే ప్రయత్నం చేసిన పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోపై సీపీ వేటు

  • మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన సాహిల్
  • కేసు నుంచి తప్పించుకునేందుకు తొలుత ముంబైకి, అక్కడి నుంచి దుబాయ్ పారిపోయిన వైనం
  • సాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు చేతులు మారిన లక్షల రూపాయలు!
  •  సాహిల్‌ ప్లేస్‌లో షకీల్ కారు డ్రైవర్‌ను ఇరికించే యత్నం చేసిన ఎస్‌హెచ్‌వోపై సస్పెన్షన్ వేటు
మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్‌కి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తొలుత ముంబైకి, ఆ తర్వాత అక్కడి నుంచి దుబాయ్ కి పరారైనట్టు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. నిన్న లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.

మరోవైపు, సాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు రూ. 20 నుంచి రూ. 25 లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరగ్గా, ఆదివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో మంతనాలు జరిపినట్టు అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. కాగా, కేసు నుంచి నిందితుడు సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నం చేసిన పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు.


More Telugu News