చిరంజీవి 'అన్నయ్య' చిత్రం ఫైట్ మాస్టర్ జోలీ బాస్టియన్ హఠాన్మరణం

  • బెంగళూరులో గుండెపోటుతో మృతి చెందిన జోలీ బాస్టియన్
  • జోలీ బాస్టియన్ వయసు 57 సంవత్సరాలు
  • కెరీర్ లో దాదాపు 900 సినిమాలకు స్టంట్ మాస్టర్ గా వ్యవహరించిన వైనం
  • బాస్టియన్ మృతికి సంతాపం తెలియజేస్తున్న దక్షిణాది సినీ ప్రముఖులు
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ ఫైట్ మాస్టర్ జోలీ బాస్టియన్ హఠాన్మరణం చెందారు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన గతరాత్రి తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆయనను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన వయసు 57 సంవత్సరాలు. 

జోలీ బాస్టియన్ స్వస్థలం కేరళలోని అలెప్పీ. ఆయన తన సినీ కెరీర్ లో కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 900 చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'అన్నయ్య' చిత్రానికి పోరాట రీతులు సమకూర్చింది జోలీ బాస్టియనే. 

కన్నడ చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో రవిచంద్రన్ కు డూప్ గా ప్రస్థానం మొదలుపెట్టిన బాస్టియన్... అనతికాలంలోనే ఫైట్ మాస్టర్ గా ఎదిగారు. జోలి బాస్టియన్ మొదట్లో కుటుంబ పోషణ కోసం ఓ బైక్ మెకానిక్ గా పనిచేశారు. బైక్ పై స్టంట్ చేస్తూ హీరో రవిచంద్రన్ దృష్టిలో పడ్డాడు. అక్కడ్నించి అతడి దశ తిరిగింది. 

తన కెరీర్ లో ఎక్కువగా రవిచంద్రన్ చిత్రాలకే బాస్టియన్ ఫైట్ మాస్టర్ గా పనిచేశారు. అంతేకాదు, 2009లో  'నినగాగి కాదిరువు' అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. 

తాజాగా, కన్నడ హీరో దునియా విజయ్ నటించిన 'భీమ' చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. కాగా, జోలీ బాస్టియన్ మృతి పట్ల దక్షిణాది చిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.


More Telugu News