ఓటమితో అధైర్యం వద్దు... భవిష్యత్తు మనదే: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు

  • లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చిన మాజీ మంత్రి
  • మెదక్‌లో ఓడిపోవడం దురదృష్టకరమన్న హరీశ్ రావు
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయంగా వచ్చి గెలిపిస్తానని హామీ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో అధైర్యపడవద్దని... భవిష్యత్తు మనదేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పార్టీ శ్రేణులకు చెప్పారు. బుధవారం మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న లోక్ సభ ఎన్నికల్లో మన సత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పనిగట్టుకొని బీఆర్ఎస్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా గంటలో మీ ముందు ఉంటానని హామీ ఇచ్చారు.

మెదక్‌లో బీఆర్‌ఎస్‌ ఓటమి దురదృష్టకరమన్నారు. తక్కువ మెజార్టీతోనే ఇక్కడ ఓడిపోయినట్లు చెప్పారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో మనం ఆరు స్థానాలు గెలిచామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయంగా తాను వచ్చి గెలిపిస్తానన్నారు. ఎన్నికల్లో అందరూ కష్టపడి పని చేశారని, వారందరికీ కృతజ్ఞతలు చెప్పాలనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానాన్ని మనం గెలవడం పక్కా అని కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు.

కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో అన్నీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. బీఆర్ఎస్ 20 గంటల కరెంట్ ఇచ్చిందని వారే చెప్పారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ డ్యామ్‌లు కట్టిందా? అని నిలదీశారు. కేసీఆర్ అంటే నమ్మకం.. బీఆర్ఎస్ అంటే విశ్వాసం అన్నారు. కరోనా వచ్చినా రైతులకు రైతుబంధు వేశామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వ పథకమూ ఆగలేదన్నారు. రైతు బీమా దండగ అని అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు సభలో మాట్లాడటం విడ్డూరమన్నారు.


More Telugu News